వందేభారత్ రైళ్లో మంటలు- ప్రయాణీకుల అలర్ట్, తప్పిన ప్రమాదం..!!
మరో రైలులో అగ్ని ప్రమాదం జరిగింది. తెలంగాణలో ఫలక్ నుమాలో జరిగిన అగ్ని ప్రమాదం మర్చిపోకముందే ఇప్పుడు వందేభారత్ లో ప్రమాదం చోటు చేసుకుంది. భోపాల్ - ఢిల్లీ వందేభారత్ లో జరిగిన అగ్ని ప్రమాదంతో ప్రయాణీకులు ఆందోళనకు గురయ్యారు. వెంటనే అప్రమత్తం కావటంతో ప్రమాదం తప్పింది. ప్రయాణీకులు వెంటనే రైలు దిగేసారు. సాంకేతిక సిబ్బంది ప్రమాదానికి గల కారణాల పైన విచారణ ప్రారంభించారు.
భోపాల్ - ఢిల్లీ మధ్య నడిచే వందేభారత్ ఎక్స్ ప్రెస్ లో ఒక్క సారిగా మంటలు చెలరేగాయి. భోపాల్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. రైల్లోని కోచ్ నెంబర్ 14లో మంటలు రావటం ప్రయాణీకులు గుర్తించారు. దీంతో వెంటనే రైలును నిలుపుదల చేసారు. రాణి కమలపతి స్టేషన్ సమీపంలో ఈ ప్రమాదాన్ని ప్రయాణీకులు గుర్తించి సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వెంటనే కుర్వాయి కెతోరా స్టేషన్ దగ్గర రైలు నిలుపుదల
చేసారు. కోచ్ లోని బ్యాటరీ బాక్స్ వద్ద పొగలు వచ్చినట్లు సిబ్బంది తేల్చారు. దీంతో వెంటనే రైలు నుంచి ప్రయాణీకులను కిందకు దించి వేసారు. ప్రయాణీకులు అంతా సురక్షితంగా ఉన్నారని...ఈ ఘటనకు గల కారణాల పైన విచారణ చేస్తామని రైల్వే అధికారులు వెల్లడించారు.

భోపాల నుంచి ఢిల్లీ వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఏడాది ఏప్రిల్ లో ప్రధాని మోదీ ఈ రైలును ప్రారంభించారు. మొత్తం 701 కిలో మీటర్ల గమ్యాన్ని 7 గంటల 30 నిమిషాల్లో వందేభారత్ చేరుకుంటోంది. రైలు సిబ్బంది సమీపంలోని రైల్వే స్టేషన్ కు సమాచారం ఇవ్వటంతో ఫైర్ ఇంజన్లతో పాటుగా ఫైర్ సేఫ్టీ అధికారులు అక్కడకు చేరుకున్నారు. వందేభారత్ రైళ్లకు ప్రయాణీకుల భద్రతకు అధిక ప్రాధాన్యత ఉంటుందని అధికారులు చెబుతున్నారు. తరచూ రాళ్ల దాడులు జరుగుతున్న వందేభారత్ లో ఇప్పుడు అగ్ని ప్రమాదం జరగటం పైన ప్రయాణీకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా నల్గొండ జిల్లాలో ఫలక్ నుమా లో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో ఏడు కోచ్ లు దహనమయ్యాయి. ఈ ప్రమాదానికి గల కారణాలను అధికారులు ఇప్పటి వరకు వెల్లడించలేదు.












Click it and Unblock the Notifications