ఫ్రీ బస్సు ఎఫెక్ట్! కర్ణాటక కాంగ్రెస్ సర్కారు సంచలన నిర్ణయం
కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం కలకలం రేపుతోంది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తున్న క్రమంలో తాజాగా బస్సు టికెట్ ఛార్జీలను ఏకంగా 15 శాతం పెంచుతూ సిద్ధరామయ్య ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కర్ణాటక కేబినెట్ ఛార్జీల పెంపునకు ఆమోదం తెలిపింది.
ఇంధన ధరలు, సిబ్బందిపై వ్యయం వంటి నిర్వహణ ఖర్చులు భారీగా పెరగడం వల్ల ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు కర్ణాటక పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి హెచ్‌కే పాటిల్ చెప్పారు. కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (KSRTC), నార్త్ వెస్ట్ కర్ణాటక రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (NWKRTC), కళ్యాణ కర్ణాటక రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (KKRTC), బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (BMTC) రవాణా కార్పొరేషన్లలో బస్సు చార్జీలను 15 శాతం పెంచారు.

ఈ నాలుగు ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్లలో పదేళ్ల క్రితం డీజిల్ వినియోగం రూ. 9.16 కోట్లు ఉండేదని.. ఇప్పుడు అది రూ. 13.21 కోట్లకు పెరిగిందన్నారు మంత్రి పాటిల్. ఇక సిబ్బందిపై రోజువారీ ఖర్చు రూ. 12.95 కోట్ల నుంచి 18.36 కోట్లకు పెరిగిందన్నారు. ఈ నేపథ్యంలోనే ఛార్జీల పెంపు నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందంటూ తమ నిర్ణయాన్ని మంత్రి పాటిల్ సమర్థించుకునే ప్రయత్నం చేశారు.
కాగా, కర్ణాటకలో అమలవుతున్న ఫ్రీ బస్సు పథకం 'శక్తి' నాన్ లగ్జరీ బస్సుల్లో కొనసాగుతుందని మంత్రి తెలిపారు. రూ. 2వేల కోట్ల మేర ప్రావిడెంట్ ఫండ్ బకాయిలను క్లియర్ చేశామని చెప్పారు. అయితే, 13 శాతం, 15 శాతం ఛార్జీల పెంపు గురించి చర్చించామని, కానీ.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్రలో ఉన్న టికెట్ రేట్లను పరిశీలించి 15 శాతం శాతం బస్సు ఛార్జీలు పెంచాలని నిర్ణయించినట్లు మంత్రి పాటిల్ వివరించారు.
కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం బస్సు ఛార్జీలు పెంచుతూ తీసుకున్న నిర్ణయంపై ప్రతిపక్ష బీజేపీ మండిపడుతోంది. మహిళలకు ఉచితమని చెప్పి.. ఇప్పుడు ఇలా బస్సు ఛార్జీలు పెంచడంతో సామాన్య ప్రజలకు తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు. ఇక, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేయడం వల్ల పేదలకు, సామాన్యులకు ఏం ప్రయోజనం ఉంటుందని నిలదీస్తున్నారు. వెంటనే కర్ణాటక ప్రభుత్వం బస్సు ఛార్జీలను పెంచాలన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications