ప్రియుడు వేరే యువతిని!, నెయిల్ పాలిష్ రిమూవర్ తాగి ప్రియురాలి ఆత్మహత్యాయత్నం
2014లో వీరి ప్రేమ వ్యవహారానికి బ్రేక్ పడినట్లు చెబుతున్నారు.
ఒంగోలు: ప్రేమించిన యువకుడు మరో యువతిని వివాహం చేసుకోవడంతో తీవ్రంగా కలత చెందిన ఓ యువతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ప్రకాశం జిల్లాలోని మణికేశ్వరంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.
వివరాల్లోకి వెళ్తే.. మణికేశ్వరంకు చెందిన ఎస్.కె కరీముల్లా అనే యువకుడు అదే గ్రామానికి చెందిన ఓ యువతిని ప్రేమించాడు. ఇద్దరూ కలిసి మెలిసి చాలారోజులు తిరిగారు. 2014లో వీరి ప్రేమ వ్యవహారానికి తెరపడింది. అదే ఏడాది కరీముల్లా ప్రేమించిన యువతి.. ఉద్యోగం కోసం చెన్నై వెళ్లింది.

చెన్నైలోనే ఆమె మరొకరితో సంబంధం పెట్టుకుందన్న అనుమానంతో కరీముల్లా ఆమెతో మాట్లాడటం మానేశాడు. ఇదే క్రమంలో ఇటీవల కరీముల్లాకు మరో యువతితో నిశ్చితార్థం జరిగింది. ఈ నెల 17న పెళ్లికి పెద్దలు నిర్ణయించారు.
ఇంతలో కరీముల్లాపై అతని ప్రియురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను ప్రేమించి మరొకరిని వివాహం చేసుకుంటున్నాడని ఫిర్యాదులో పేర్కొంది. స్థానిక పోలీసులు పట్టించుకోకపోవడంతో ఎస్పీకి కూడా ఫిర్యాదు చేసింది. కేసును పోలీసులు పట్టించుకునే లోపే కరీముల్లాకు వేరే యువతితో ఈ నెల 17న వివాహం జరిగిపోయింది.
ప్రియుడి పెళ్లి జరగడంతో తీవ్ర మనస్తాపానికి గురైన యువతి ఆత్మహత్యాయత్నం చేసింది. ఇంట్లో ఉన్న నెయిల్ పాలిష్ రిమూవర్ తాగి ఆమె ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దీంతో హుటాహుటిన ఆమెను ఆసుపత్రికి తరలించారు. మరోవైపు కరీముల్లా ఎక్కడికో పారిపోయాడు. ప్రస్తుతం పోలీస్ దర్యాప్తు కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications