మైసూరు ప్యాలెస్, బంగారు తాపడం గోల్ మాల్
మైసూరు: ప్రపంచ ప్రసిద్ది చెందిన మైసూరు ప్యాలెస్ లో బంగారు తాపడం పెట్టే విషయంలో అధికారులు చేతివాటం చూపించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. నాసిరకంగా బంగారు తాపడం పెట్టి కోట్ల రూపాయలు గోల్ మాల్ చేసి చెడ్డ పేరు తీసుకు వచ్చారని అంటున్నారు. ఈ ఆరోపణల ఫలితంగా డిప్యూటి డైరెక్టర్ మీద వేటు పడింది.
మైసూరు ప్యాలెస్ బోర్డు డిప్యూటి డైరెక్టర్ టి.ఎస్. సుబ్రమణ్య ను సస్పెండ్ చేశారు. మైసూరు జిల్లా కలెక్టర్, మైసూర్ ప్యాలెస్ బోర్డు అధ్యక్షులుగా ఉన్న సి. శిఖా సీనియర్ అధికారి సుబ్రమణ్యను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. సుబ్రమణ్య అవకతవకలకు పాల్పడ్డారని విచారణలో వెలుగు చూసింది.
మైసూరు ప్యాలెస్ లోని అంబ విలాస్ దర్బార్ హాల్ లోపలి భాగంలో బంగారు తాపడం వెయ్యడానికి 2011లో రూ. 55 లక్షలు, 2012లో రూ. 24 లక్షలు, 2013లో రూ. 3.65 కోట్ల నిధులు కేటాయించారు. అయితే బంగారు తాపడం చెయ్యలేదని ఆరోపణలు వచ్చాయి.

తరువాత బంగారు తాపడం పనులు పూర్తి అయ్యాయని నిధులు విడుదల చేశారు. లక్నోలోని జాతీయ సాంసృతిక సంపద, పరిశోధన, ప్రయోగశాల నిపుణులు మైసూరు ప్యాలెస్ లో పరిశీలించి నాసిరకంగా బంగారు తాపడం పనులు చేశారని నివేదిక ఇచ్చారు.
లోకాయుక్త అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. కేసు విచారణ సమయంలో సుబ్రమణ్య అదే పదవిలో ఉంటే విచారణ చెయ్యలేమని లోకాయుక్త అధికారులు తేల్చి చెప్పారు. అందుకు ఆయనను సస్పెండ్ చేశారు. ఈ స్కాం కేసులో సుబ్రమణ్యతో పాటు అనేక మంది మీద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications