కొత్త శక్తులతో రీ-ఎంట్రీ ఇస్తున్న ‘తేజస్’ యుద్ధ విమానాలు!

భారత రక్షణ రంగానికి సంబంధించి అత్యంత కీలకమైన అప్‌డేట్ వచ్చేసింది. అమెరికా నుంచి ఇంజిన్ల సరఫరాలో జరిగిన జాప్యం, రకరకాల టెస్టింగ్‌ల వల్ల చాలా కాలంగా నిలిచిపోయిన 'తేజస్ Mk1A’ యుద్ధ విమానాల పంపిణీ ఎట్టకేలకు మళ్లీ ప్రారంభం కానుంది. ఈ ఏడాది ఆగస్టు లేదా సెప్టెంబర్ నాటికి ఈ అధునాతన ఫైటర్ జెట్లను భారత వైమానిక దళానికి (IAF) అందించేందుకు ప్రభుత్వ రంగ విమాన తయారీ సంస్థ 'హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్’ (HAL) సర్వసన్నద్ధమవుతోందని ఎన్డీటీవీ (NDTV) ప్రత్యేక నివేదిక వెల్లడించింది.

నిజానికి, ఈ ప్రాజెక్ట్ ఆలస్యం కావడం అనేది HAL పెట్టుబడిదారులను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. గడువులు పదేపదే మారడంతో, ఈ విమానాలు అసలు అనుకున్న సమయానికి వస్తాయా లేదా అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. కొందరు విశ్లేషకులు ఆర్థిక సంవత్సరం 2027 (FY27) తర్వాత కూడా ఈ ప్రాజెక్ట్ ఆలస్యం కావచ్చని అంచనా వేశారు. అయితే, వీటన్నింటికీ తెరదించుతూ HAL ఛైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ రవి కోట కీలక ప్రక్రియను వివరించారు.

HAL To Restart Tejas Mk1A Deliveries To IAF By September As GE Aerospace Supplies Crucial Jet Engines

ప్రఖ్యాత 'జీఈ ఏరోస్పేస్’ (GE Aerospace) సంస్థ నుండి HAL ఇప్పటివరకు ఆరు ఇంజిన్లను అందుకుందని, ఈ ఆర్థిక సంవత్సరంలో మరిన్ని ఇంజిన్లు రానున్నాయని ఆయన తెలిపారు. కొత్తగా వచ్చిన ఇంజిన్లను అమర్చిన తర్వాత కూడా విమానాలకు మరికొన్ని నూతన మెరుగులు, కఠినమైన పరీక్షలు జరుగుతున్నాయని, ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ చాలా సానుకూల దిశలో సాగుతోందని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికే ఈ కొత్త ఇంజిన్లతో కూడిన తేజస్ విమానాలు గాల్లో విజయవంతంగా ఎగురుతున్నాయని HAL ధృవీకరించింది.

తార జువ్వ: భారత అమ్ములపొదిలోకి మరో అస్త్రం
తార జువ్వ: భారత అమ్ములపొదిలోకి మరో అస్త్రం

అదరహో అనిపించేలా..

ఒకవైపు తయారీ రంగంలో సవాళ్లు ఎదురైనప్పటికీ, HAL ఆర్థిక ఫలితాలు మాత్రం అదరహో అనిపించేలా ఉన్నాయి. ఆర్థిక సంవత్సరం 2026 (FY26) లో HAL కార్యకలాపాల ద్వారా రూ. 33,050 కోట్ల ఆదాయాన్ని ఆర్జించి, గతేడాదితో పోలిస్తే 7 శాతం వృద్ధిని నమోదు చేసింది. అలాగే కంపెనీ పన్నుకు ముందు లాభం 12 శాతం పెరిగి రూ. 12,112 కోట్లకు చేరింది. మరీ ముఖ్యంగా, HAL ఆర్డర్ బుక్ మునుపెన్నడూ లేని విధంగా రూ. 1.89 లక్షల కోట్ల నుండి ఏకంగా రూ. 2.54 లక్షల కోట్లకు పెరిగింది. ఈ ఒక్క ఆర్థిక సంవత్సరంలోనే కంపెనీ రూ. 97,028 కోట్ల విలువైన కొత్త ఆర్డర్లను దక్కించుకోగా, అందులో 97 తేజస్ Mk1A యుద్ధ విమానాలకు సంబంధించిన మెగా డీల్ కూడా ఉంది. రాబోయే రెండేళ్లలో హెలికాప్టర్ల తయారీ, పాత విమానాల అప్‌గ్రేడ్‌లు, మరమ్మత్తుల విభాగాల ద్వారా మరో రూ. 90,000 కోట్ల ఆర్డర్లు వస్తాయని కంపెనీ ఆశాభావంతో ఉంది.

సకాలంలో డెలివరీ చేయగలిగితే..

తేజస్ విమానాలు, 'HTT-40’ శిక్షణ విమానాల ప్రాజెక్టులలో జరిగిన జాప్యాన్ని HAL చాలా తెలివిగా అధిగమించింది. రక్షణ శాఖకు అవసరమైన ఏఎల్‌హెచ్ (ALH) హెలికాప్టర్లు, ఎల్‌ఎమ్-31ఎఫ్‌పి (AL-31FP) ఇంజిన్లు, ఆర్‌డీ-33 (RD-33) ఇంజిన్ల పంపిణీని వేగవంతం చేయడం ద్వారా కంపెనీ తన నష్టాలను భర్తీ చేసుకోగలిగింది. ఈ వ్యూహంపై HAL ఆర్థిక డైరెక్టర్ బరేణ్య సేనేపతి మాట్లాడుతూ, రాబోయే రోజుల్లో తమ లైట్ కాంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ (LCA), HTT-40 ప్రాజెక్టులను సకాలంలో డెలివరీ చేయగలిగితే కంపెనీ అమ్మకాల్లో తయారీ విభాగం అత్యంత కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. వచ్చే ఆర్థిక సంవత్సరం (FY27) లో కూడా రెండంకెల ఆదాయ వృద్ధిని, స్థిరమైన మార్జిన్లను HAL అంచనా వేస్తోంది.

భారత్ అమ్ములపొదిలో ధురంధర్- అగ్ని మిస్సైల్ టెస్ట్ సక్సెస్
భారత్ అమ్ములపొదిలో ధురంధర్- అగ్ని మిస్సైల్ టెస్ట్ సక్సెస్

రాబోయే రోజుల్లో..

ఈ పరిణామాల నేపథ్యంలో, అంతర్జాతీయ ఆర్థిక విశ్లేషణ సంస్థ 'గోల్డ్‌మన్ సాచ్స్’ HAL స్టాక్‌పై తన "న్యూట్రల్" రేటింగ్‌ను కొనసాగిస్తూనే, టార్గెట్ ధరను రూ. 5,255 నుండి రూ. 5,225కి స్వల్పంగా తగ్గించింది. మార్కెట్‌లో HAL షేరు మరింత దూసుకుపోవడానికి, పెట్టుబడిదారుల్లో పూర్తి నమ్మకం కలగడానికి రాబోయే రోజుల్లో తేజస్ Mk1A విమానాలను సకాలంలో డెలివరీ చేయడమే అత్యంత కీలకమైన ట్రిగ్గర్ అని గోల్డ్‌మన్ సాచ్స్ స్పష్టం చేసింది. ఏదేమైనా, ఆగస్టు-సెప్టెంబర్ నాటికి స్వదేశీ యుద్ధ విమానాలు వైమానిక దళంలోకి చేరనుండడం దేశ రక్షణ రంగానికి పెద్ద బూస్టింగ్ అనే చెప్పాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+