Lockdown in India: భారత్ లో లాక్ డౌన్ పై కేంద్రం సంచలన ప్రకటన..!
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఏమాత్రం తగ్గడం లేదు. ఇరాన్- అమెరికా యుద్ధం కారణంగా హార్మూజ్ జలసంధిని ఇరాన్ మూసివేసిన విషయం తెలిసిందే. దాంతో ప్రపంచ దేశాలు చమురు, గ్యాస్ సంక్షోభంలో కూరుకుపోయాయి. ముడి చమురు, గ్యాస్ కొరత కారణంగా అభివృద్ధి చెందిన దేశాలు కూడా ఇబ్బందులు పడుతున్నాయి. ఇక హార్మూజ్ జలసంధి మూసివేత ప్రభావం భారత్ పైనా పడింది. మనదేశంలోనూ అనేక చోట్ల పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమిచ్చాయి.
గ్యాస్ సిలిండర్ బుకింగ్స్ , డెలివరీలోనూ పలు మార్పులు చేసింది కేంద్రం. మరోవైపు ఇటీవల ప్రధాని మోదీ మాట్లాడుతూ.. సంవత్సరం పాటు బంగారం కొనుగోలు చేయొద్దని సూచించారు. అలాగే పెట్రోల్, డీజిల్ వాడకాన్ని తగ్గించుకోవాలని అన్నారు. ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేయాలని సూచించారు. అంతేకాక ఏడాదిపాటు విదేశీ ప్రయాణాలు మానుకోవాలన్నారు. ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్, ఆన్ లైన్ మీటింగ్స్ కు ప్రాధాన్యం ఇవ్వాలని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.
ప్రధాని మోదీ వ్యాఖ్యలతో దేశంలో మరోసారి లాక్ డౌన్ విధిస్తారా..? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ తరుణంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో లాక్ డౌన్ విధించే ఆలోచన లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఇంధన కొరత లేదని ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. భారత్ వద్ద తగినంత నిల్వలు ఉన్నాయని అవి 69 రోజులకు సరిపడా ఉన్నాయని స్పష్టం చేశారు. అలాగే 45 రోజులకు సరిపడా ఎల్పీజీ స్టాక్ అందుబాటులో ఉందని అన్నారు. దేశీయంగా ఎల్పీజీ ఉత్పత్తిని రోజుకు 35 వేల టన్నుల నుంచి దాదాపు 54 వేల టన్నులకు పెంచినట్లు కేంద్రమంత్రి స్పష్టం చేశారు.

ప్రస్తుతం ప్రపంచదేశాల్లో పరిస్థితులు ఉద్రిక్తంగా ఉన్నప్పటికీ భారత్ లో ఇంధన సరఫరాలో ఎలాంటి ముప్పు లేదని.. సాధారణ జీవనానికి లాక్ డౌన్ లాంటి ఆంక్షలు ఉండబోవని ప్రభుత్వం భరోసా ఇచ్చింది. ప్రస్తుతం పెట్రోలియం మినిస్టర్ హర్దీప్ సింగ్ పూరీ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.












Click it and Unblock the Notifications