మరో పరీక్ష రద్దు: 2014 నుంచి జరిగిన అన్ని పరీక్షలపై సీఐడీ విచారణకు సీఎం ఆదేశం
జార్ఖండ్‌లో గత 24 రోజులుగా కొనసాగుతూ వస్తోన్న ఆందోళనలపై ఎట్టకేలకు ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన లభించింది. జార్ఖండ్ స్టాఫ్ సెలెక్షన్ కమీషన్- కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ (JSSC-CGL) సహా అన్ని రకాల ఉద్యోగ నియామక పరీక్షలు, వాటి ఫలితాలను రద్దు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ కొద్దిసేపటి కిందటే ప్రకటించారు. నిరుద్యోగ యువత, వారి హక్కులను కాపాడేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.
రాష్ట్రంలో ఉద్యోగ పరీక్షల నిర్వహణలో జరిగిన అక్రమాలకు వ్యతిరేకంగా వేలాది మంది అభ్యర్థులు రాజధాని రాంచీలోని జైపాల్ సింగ్ ముండా స్టేడియం వద్ద దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. మంత్రుల బృందంతో విద్యార్థి ప్రతినిధులు జరిపిన చర్చలు విఫలం కావడంతో ఆందోళనలు మరింత ఉధృతం అయ్యాయి. ఈ పరీక్షల రద్దు కోరుతూ విద్యార్థి నేత దేవేంద్ర నాథ్ మహతో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు.

ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ తన మంత్రివర్గ సహచరులతో సుదీర్ఘంగా సమీక్షా సమావేశం నిర్వహించారు. విద్యార్థుల డిమాండ్లకు అనుకూలంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. పరీక్షల రద్దు ప్రకటన వెలువడగానే జైపాల్ సింగ్ ముండా స్టేడియం వద్ద పండుగ వాతావరణం నెలకొంది. గత మూడు వారాలుగా కంటిమీద కునుకు లేకుండా, ఎండనక వాననక రోడ్లపైనే దీక్షలు చేస్తున్న అభ్యర్థులు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. స్వీట్లను పంచిపెట్టారు. ఈ విజయం తమ అలుపెరగని పోరాటానికి, అచంచల ఐక్యతకు దక్కిన ప్రతిఫలంగా అభివర్ణించారు.
ఇటీవల కాలంలో నిర్వహించిన పరీక్షల్లో కనీస నియమ నిబంధనలను కాంట్రాక్ట్ ఏజెన్సీలు పాటించట్లేదని ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ అంగీకరించారు. దీనివల్ల పెద్ద ఎత్తున అవకతవకలు చోటుచేసుకున్నట్లు ప్రాథమికంగా గుర్తించామని అన్నారు. ఈ మొత్తం అక్రమాల వెనుక ఉన్న నెట్‌వర్క్‌ను ఛేదించడానికి జార్ఖండ్ హైకోర్టుకు చెందిన ఒక రిటైర్డ్ న్యాయమూర్తి నేతృత్వంలో ఉన్నత స్థాయి స్వతంత్ర విచారణ కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించామని అన్నారు.
ఈ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా బాధ్యులైన వారిపై తీవ్ర చర్యలు తీసుకుంటామని హేమంత్ సోరేన్ స్పష్టం చేశారు. ఓ నిర్దుష్ట పరీక్ష రద్దుకే పరిమితం కాకుండా, భవిష్యత్ లో ఇలాంటి తప్పులు పునరావృతం కాకుండా ఉండేలా కఠిన కార్యాచరణను రూపొందిస్తోన్నామని సోరెన్ తెలిపారు. ఈ క్రమంలోనే టీడీపీఎల్ కు సంబంధించిన అన్ని రకాల కాంట్రాక్ట్ లను తక్షణమే నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేశామని అన్నారు.
పరీక్షల లీకేజీల వెనుక లోతైన మతలబులు ఉన్నట్లు అనుమానిస్తున్న ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2014 నుంచి రాష్ట్రంలో నిర్వహించిన అన్ని వివాదాస్పద నియామక పరీక్షలపై సమగ్రమైన సీఐడీ దర్యాప్తునకు ఆదేశించింది. గత పదేళ్ల కాలంలో జరిగిన చిన్న, పెద్ద తేడా లేకుండా అన్ని రకాల నియామక అవకతవకలను బయటకు తీసి నిందితులను కఠినంగా శిక్షించడమే లక్ష్యంగా సీఐడీ దర్యాప్తు సాగుతుందని హేమంత్ సోరెన్ పేర్కొన్నారు.













Click it and Unblock the Notifications