భగ్గుమంటోన్న భానుడు.. టెంపరేచర్ పీక్, అల్లాడుతున్న జనం..
ఎండలు మండిపోతున్నాయి. ఇప్పుడే ఠారెత్తిస్తుంటే.. మరింత పెరుగుతాయని వాతావరణ శాఖ చెబుతోంది. సో వేసవిలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సజెస్ట్ చేస్తోంది. మార్చి రెండోవారం నుంచే ఎండలు ఠారెత్తిస్తున్నాయి. రోజు 40 డిగ్రీలకు పైగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మధ్యాహ్నం అయిందంటే చాలు.. రోడ్లపై జనసంచారం తగ్గిపోతోంది. ఇది తక్కువేనని.. ముందు ముందు మరింతగా ఉష్ణోగ్రతలు పెరుగుతాయని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు.

అప్పుడే ఎండల వేడి..
మొన్నటిదాకా వీచిన చలిగాలులు చల్లబడ్డాయి. ఉక్కపోత కూడా మొదలైంది. గతేడాదితో పోలిస్తే ఈ సారి మార్చి రెండో వారంలో తెలుగు రాష్ట్రాల్లో 35 నుంచి 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. భవిష్యత్‌లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే సూచనలు కన్పిస్తున్నాయి.ఉత్తర భారతంలో వీస్తున్న వేడి గాలుల వల్ల మార్చి రెండో వారంలోనే పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఏప్రిల్, మే నెలల్లో వేడి గాలులతోపాటు తెలంగాణ వ్యాప్తంగా రికార్డ్ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

బెంబేలు
ఎండల ప్రభావంతో అడుగు బయటపెట్టాలంటే జనం వణికిపోతున్నారు. ఎండలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మార్చిలో ఇలా ఉంటే.. రానున్న రోజుల్లో ఇంకెంత దారుణ పరిస్థితులు ఉంటాయోనని ఆందోళన చెందుతున్నారు. బంగాళాఖాతంలో ఇటీవల ఏర్పడిన అల్పపీడనం ప్రభావం తగ్గింది. దీంతో వేడి మరింత పెరిగింది. మధ్యాహ్నం ఉక్కపోత ఉంటోంది. ఉత్తర కోస్తాంధ్ర, యానాం ప్రాంతాల్లో వాయువ్య దిశ నుంచి బలమైన గాలులు వీస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ ఇంఛార్జి డైరెక్టర్ శ్రావణి తెలిపారు.

ఏపీ, తెలంగాణలో
రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో వాతావరేణం పొడిగా మారింది. ఉభయ గోదావరి జిల్లాలతోపాటు కర్నూలు జిల్లాలో ఎండల తీవ్రత ఉంది. నంద్యాలలో 35 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. తెలంగాణ రాష్ట్రంలో గల ఖమ్మం, సూర్యాపేట, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఎండ వేడి ఎక్కువగా ఉంది. క్రమేపీ రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణం పొడిగా మారుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. వడగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. అవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచిస్తున్నారు.












Click it and Unblock the Notifications