భగ్గుమంటోన్న బెంగళూరు: 72 గంటల పాటు 144 సెక్షన్: చరిత్రకారుడి అరెస్ట్.. !
బెంగళూరు: దేశవ్యాప్తంగా అమలు చేయడానికి ఉద్దేశించిన పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా కొద్దిరోజులుగా కర్ణాటక రాజధాని బెంగళూరులో కొనసాగుతూ వస్తోన్న నిరసన ప్రదర్శనలు, ఆందోళనలు.. గురువారం నాటికి మరింత ఉగ్రరూపం దాల్చాయి. బెంగళూరులోని ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ (ఐఐఎస్సీ) సహా పలు విశ్వవిద్యాలయాల విద్యార్థులు భారీ ఆందోళనను నిర్వహించడానికి తలపెట్టారు.

మూడు రోజుల పాటు 144 సెక్షన్..
ప్రముఖ చరిత్రకారుడు రామచంద్రగుహ సహా పలువురు ప్రముఖులు ఈ మహా ఆందోళనల్లో భాగం పంచుకోవడానికి బెంగళూరుకు చేరుకున్నారు. పరిస్థితి చేయి దాటుతుండటంతో అప్రమత్తమైన యడియూరప్ప సర్కార్.. 144 సెక్షన్ ను విధించింది. బుధవారం తెల్లవారు జామున 6 గంటలకు దీన్ని అమలులోకి తీసుకొచ్చారు బెంగళూరు నగర పోలీసులు. 72 గంటల పాటు ఈ నిషేధాజ్ఞలు అమలులో ఉంటాయని వెల్లడించారు బెంగళూరు సహా చిత్రదుర్గ, విజయపుర, కలబురగి, బీదర్ వంటి నగరాల్లోనూ 144 సెక్షన్ ను విధించారు.

టౌన్ హాల్ వద్ద ఉద్రిక్తత..
144 సెక్షన్ అమలులో ఉన్నప్పటికీ.. విద్యార్థులు నిరసన ప్రదర్శనకు దిగారు. బెంగళూరు నడిబొడ్డున ఉండే సర్ పుట్టణ్ణ చెట్టి టౌన్ హాల్ వద్ద పెద్ద సంఖ్యలో గుమికూడారు. చరిత్రకారుడు రామచంద్రగుహ విద్యార్థులతో కలిశారు. అనంతరం వారు ప్రదర్శనగా మెజస్టిక్ వైపు బయలుదేరి వెళ్లడానికి ప్రయత్నించగా.. పోలీసులు అడ్డుకున్నారు. టౌన్ హాల్ వద్ద నుంచి కదలడానికి నిరాకరించారు. చుట్టూ బ్యారికేడ్లను అమర్చారు. 144 సెక్షన్ అమల్లో ఉందని, దీన్ని ఉల్లంఘించిన వారిని అరెస్టు చేస్తామని హెచ్చరించారు.

నో సీఏఏ, నో ఎన్ఆర్సీ..
పోలీసుల హెచ్చరికలను విద్యార్థులు పట్టించుకోలేదు. వందలాది మంది విద్యార్థులు.. ర్యాలీని నిర్వహించడానికి ప్రయత్నించారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు. పోలీసుల మధ్య పెద్ద ఎత్తున తోపులాట చోటు చేసుకుంది. నో సీఏఏ, నో ఎన్ఆర్సీ అంటూ విద్యార్థులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కేంద్రం, కర్ణాటకలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్లకార్డులను ప్రదర్శించారు.

రామచంద్రగుహ అరెస్టు..
ఈ సందర్భంగా రామచంద్రగుహ మీడియాతో మాట్లాడటానికి ప్రయత్నించారు. దేశం మొత్తం వ్యతిరేకిస్తున్నప్పటికీ.. బీజేపీ ప్రభుత్వం పట్టుదలకు పోతోందని విమర్శించారు. దీనికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని అన్నారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని ఏ ఉద్దేశంతో ప్రవేశ పెట్టడానికి బీజేపీ ప్రయత్నిస్తోందో.. ఆ ఉద్దేశం నెరవేరబోదని చెప్పారు. రామచంద్రగుహ విలేకరులతో మాట్లాతున్న సమయంలో పోలీసులు ఆయనను రెక్కలు పట్టుకుని పక్కకు లాగేశారు.












Click it and Unblock the Notifications