ఓట్ల కోసమే కేసీఆర్ పథకాలు: తొక్కిపడేస్తం ఖబడ్ధార్ అంటూ ఈటల రాజేందర్ హెచ్చరిక
కరీంనగర్: హజూరాబాద్ ఉపఎన్నికలో గెలుపే లక్షయంగా ప్రచారం నిర్వహిస్తున్న మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ పాలనపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. గురువారం జమ్మికుంట మండలం వావిలాల గ్రామంలో పర్యటించిన సందర్భంగా ఈటల మాట్లాడారు.
నాలుగు రోజులుగా వర్షంలో తడుస్తున్నావు, ఎండుతున్నావు ఎందుకు బిడ్డ అని ప్రజలు అడుగుతున్నారని ఈటల చెప్పుకొచ్చారు. కేసీఆర్ డబ్బు, అధికారం, పోలీసుల ముందు తాను గెలువలేను. అందుకే ప్రజాక్షేత్రంలో తేల్చుకుందామని మీ ముందుకు వచ్చాను అంటూ ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు.

'ఇక్కడికి వచ్చి నేను అంటే నేను ఎమ్మెల్యే అని అంటున్నారు. ఎవర్రా నువ్వు.. నా మీద వావిలాల ప్రజలకు ఎంత ప్రేమ ఉందో నీకు తెలుసా బిడ్డా' అంటూ ఈటల రాజేందర్ ఆగ్రహించారు. మంత్రి అనేటోడు చెబితే పెన్షన్ రావాలి. కాని కేసీఆర్ అక్కడ తాళం వేసి పెట్టిండు. ఇది నిజం అవునో, కాదో ఇక్కడికి వచ్చే ఎమ్మెల్యేలను అడగాలని ఈటల కోరారు.
దళితుల ఓట్ల కోసం దళిత బంధు పెట్టిండు.. నేను ప్రభుత్వ పథకాలు ఎప్పుడు వ్యతిరేకించలేదు. వ్యతిరేకించింది ఒక్కటే.. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు రైతు బంధు ఇవ్వద్దు అని చెప్పాను. నయీం అనేటోడు చంపుతా అని బెదిరిస్తే ఏనాడు భయపడ లేదు అని ఈటల వ్యాఖ్యానించారు.
ఈ ఉపఎన్నిక గెలుపు హుజురాబాద్ ప్రజల ఆత్మగౌరవ గెలుపు అని ఈటల వ్యాఖ్యానించారు. సీఎం కేసీఆర్.. దళితులపై ప్రేమతో కాదు దళితుల ఓట్ల కోసం దళిత బంధు అంటున్నాడు. నన్ను ఓడించడానికి కాంగ్రెస్ వాడికి డబ్బులు ఇచ్చింది వాస్తవం.. కాకపోతే ముక్కు నేలకు రాస్తా.. నువ్వు రాస్తావా ? అంటూ సవాల్ విసిరారు. నేను ప్రజల కోసం కష్టపడుతుంటే నన్ను బర్తరఫ్ చేసినవ్.. మర్యాద తప్పితే తొక్కిపడేస్తం ఖబర్ధార్' అంటూ ఈటల రాజేందర్ హెచ్చరించారు. .
ఒక్క నాయకుడు కూడ నా వద్ద లేకుండా కేసీఆర్ కొనుగోలు చేసిండు. సొంత పార్టీ నాయకులను కొనుగోలు చేసే దౌర్భాగ్య పరిస్థితి నేను ఎక్కడ చూడ లేదు. ఈటెల రాజేందర్ అనేటోడు ఉక్కు పాదాలతో ఉద్యమం చేసిండు గుర్తు పెట్టుకో బిడ్డా.. చిన్న బక్క పలచని వాడి మీద ఇన్ని కుట్రలు చేస్తున్నారు. లీడర్ లేకుండా చేయాలని చూస్తున్నారు. దిక్కు మొక్కు లేని జనం ఒక్కొక్కరు నిప్పు కణం అవుతారన్నారు ఈటల రాజేందర్.












Click it and Unblock the Notifications