వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హుజూరాబాద్: ‘ఒక్కో ఓటుకు రూ.6 వేలు.. మాకెందుకు ఇవ్వరు’ అంటూ ధర్నాకు దిగిన ఓటర్లు - ప్రెస్ రివ్యూ

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
హుజూరాబాద్‌లో ఓటర్లకు నగదు పంపిణీ

ఓట్ల కోసం నోట్లు కొంతమందికే ఇస్తున్నారని, తమకెందుకు ఇవ్వడం లేదంటూ బుధవారం రాత్రి కొందరు రోడ్డెక్కి ధర్నాకు దిగారని సాక్షి దినపత్రిక ఒక కథనంలో పేర్కొంది.

కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం రంగాపూర్, జమ్మికుంట మండలం మడిపెల్లి, హనుమకొండ జిల్లాలోని కమలాపూర్‌లో పలు వార్డుల్లో ఈ ధర్నాలు, నిరసనలు జరిగాయి.

ఒక పార్టీకి చెందిన నేతలు రూ.6 వేలు చొప్పున పంపిణీ చేసిన డబ్బులు కొందరికే అందాయని, తమకూ ఇవ్వాల్సిందేనని వీరంతా డిమాండ్ చేశారు.

దీంతో రంగంలోకి దిగిన సదరు పార్టీ నేతలు, ఆందోళనకు దిగిన వారిని బుజ్జగించి, వివాదాన్ని సద్దుమణిగేలా చేశారు.

పోలీసుల తనిఖీల్లో స్వాధీనం చేసుకున్న 'లెక్క'లివీ..

► నగదు రూ.3,29,36,830

► రూ.6,36,052 విలువైన 944 లీటర్ల మద్యం

► రూ.69,750 విలువైన 11.4 కేజీల గంజాయి

► రూ.44,040 విలువైన పేలుడు పదార్థాలు

► రూ.2,21,000 విలువైన దుస్తులు

► రూ.10,60,000 విలువైన బంగారం, వెండి ఆభరణాలు

► ఇక 2,284 మందిని బైండోవర్‌ చేయగా.. 116 కేసులు నమోదయ్యాయి.

కె శ్రీనివాసన్, జూపల్లి రామేశ్వరరావు సహా 18 మంది టీటీడీ సభ్యులకు హైకోర్టు నోటీసులు

తిరుమల తిరుపతి దేవస్థానాల పాలకమండలి సభ్యులు 18 మందికి, ఆలయ ఈవో, దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శులకు హైకోర్టు నోటీసులు జారీ చేసిందని ప్రజాశక్తి దినపత్రిక ఒక కథనంలో పేర్కొంది.

సభ్యులపై ఆరోపణలు చేస్తూ బీజేపీ నేత భాను ప్రకాష్‌ రెడ్డి దాఖలు చేసిన పిల్‌ను బుధవారం చీఫ్‌ జస్టిస్‌ పీకే మిశ్రా, జస్టిస్‌ ఏవీ శేషసాయిలతో కూడిన డివిజన్‌ బెంచ్‌ విచారణ జరిపింది.

పిటిషనర్‌ లాయర్‌ ఎన్‌.అశ్వనీకుమార్‌ వాదిస్తూ, క్రిమినల్‌ కేసులున్న వాళ్లను సభ్యులుగా నియమించేందుకు దేవాదాయ చట్టంలోని 18, 19 సెక్షన్లకు వ్యతిరేకమన్నారు.

మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా మాజీ చైర్మన్‌ కేతన్‌ దేశారుపై ఉన్న కేసుల వివరాలను అందజేశారు.

వీటిని పరిశీలించిన తర్వాత హైకోర్టు.. టీటీడీ సభ్యులు ఎన్‌.శ్రీనివాసన్‌, రాజేశ్‌ శర్మ, నంద కుమార్‌, డాక్టర్‌ కేతన్‌ దేశారు, పి.సనత్‌ కుమార్‌, జూపల్లి రామేశ్వరరావు, ఎం.కేశవ నవకర్‌, ఎంఎన్‌ శశిధర్‌, బి.మధుసూధన్‌ యాదవ్‌, కె.సంజీవయ్య, కె.విద్యాసాగరరావు, అల్లూరి మల్లేశ్వరి, పాకాల అశోక్‌, మల్లాడి కృష్ణారావు, వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, ఆర్‌.విశ్వనాథరెడ్డి, కాటసాని రాంభూపాల్‌ రెడ్డి, బండి పార్థసారథి రెడ్డిలకు నోటీసులు ఇచ్చింది.

విచారణను నవంబర్‌ 17కి వాయిదా వేసింది.

డీజీపీ గౌతమ్‌ సవాంగ్

ఆంధ్రప్రదేశ్‌లోకి ఒక్క గ్రాము హెరాయిన్‌ కూడా రాలేదు - డీజీపీ గౌతమ్‌ సవాంగ్

రాష్ట్రంలో హెరాయిన్‌ లేదని డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ మరోమారు స్పష్టం చేశారని ఆంధ్రజ్యోతి దినపత్రిక ఒక కథనంలో పేర్కొంది.

హెరాయిన్‌ లాంటి డ్రగ్స్‌ విదేశాల నుంచి దిగుమతి అవుతుంటే గుజరాత్‌లో పట్టుబడిందని, రాష్ట్రంలోకి ఒక్క గ్రాము కూడా రాలేదని డీజీపీ అన్నారు.

స్మగ్లర్లు విజయవాడలో అడ్రస్‌ మాత్రమే వాడుకున్నారని, నరసాపురం నుంచి దుస్తుల్లో ఎగుమతి అయిన డ్రగ్స్‌కు కూడా ఏపీతో సంబంధం లేదని చెప్పారు.

రాష్ట్రవ్యాప్తంగా కొవిడ్‌తో ప్రాణాలు కోల్పోయిన పోలీసు కుటుంబాలకు పోలీసుశాఖ, ప్రభుత్వం, మ్యాన్‌కైండ్‌ ఫార్మా ఉమ్మడిగా రూ.13 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించాయి.

ఈ సందర్భంగా మంగళగిరిలోని రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఉన్నతాధికారులతో కలిసి డీజీపీ సవాంగ్‌ మాట్లాడారు.

రాష్ట్రంలో హెరాయిన్‌ లేదన్నారు. గంజాయి మాత్రం ఏపీ సరిహద్దుల్లోని అటవీ ప్రాంతంలో కొన్నేళ్లుగా సాగవుతోందని చెప్పారు. గతంలో ఎన్నడూలేని విధంగా ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసి సెబ్‌, అటవీశాఖ, ప్రభుత్వ అధికారులు, ప్రజల సహకారంతో గంజాయి సాగును ధ్వంసం చేస్తున్నట్లు వివరించారు.

రాష్ట్రంలో కొవిడ్‌తో ప్రాణాలు కోల్పోయిన పోలీసుల కుటుంబాలకు బుధవారం రూ.13 లక్షల చొప్పున జిల్లాల వారీగా అందజేశారు.

తెలంగాణ జూనియర్‌ డాక్టర్స్‌ అసోసియేషన్‌ తెలంగాణ జూడాలు

మాపై దాడులు చేసే బదులు ప్రభుత్వాన్ని ప్రశ్నించండి - ప్రజలకు తెలంగాణ జూనియర్‌ డాక్టర్స్‌ అసోసియేషన్‌ విజ్ఞప్తి

రోగులకు ఇబ్బంది కలిగినప్పుడు, దురదృష్టవశాత్తు వారు చనిపోయినప్పుడు పేషెంట్ల బంధువులు తమపై దాడులు చేయటం ఆనవాయితీగా మారిందని తెలంగాణ జూనియర్‌ డాక్టర్ల సంఘం (టీ-జూడా) ఆవేదన వ్యక్తం చేసినట్లు నవ తెలంగాణ దినపత్రిక ఒక కథనంలో పేర్కొంది.

మౌలిక వసతులు లేకుండా సరైన పరికరాలు, మందులు అందుబాటులో లేకుండా తామెలా వైద్యం చేయగలమని ఆ సంఘం నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. అందువల్ల తమపై దాడులు చేయటాన్ని మానుకొని ఆయా సౌకర్యాల కోసం ప్రజలు ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని విజ్ఞప్తి చేశారు. ఉస్మానియా ఆస్పత్రికి నూతన భవనాన్ని వెంటనే నిర్మించాలని ఆ సంఘం ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది.

కోఠిలోని ఉస్మానియా మెడికల్‌ కళాశాల ఆవరణలో తెలంగాణ జూనియర్‌ డాక్టర్స్‌ అసోసియేషన్‌ బుధవారం మీడియా సమావేశం నిర్వహించింది.

ఈ సందర్భంగా సంఘం సలహాదారు డాక్టర్‌ రాజీవ్‌, ఉస్మానియా మెడికల్‌ కళాశాల జూడా అధ్యక్షుడు డాక్టర్‌ సాగర్‌. ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ కార్తీక్‌. సలహాదారు డాక్టర్‌ విజరు మాట్లాడుతూ రెండు రోజుల క్రితం ఒక పీజీ వైద్యురాలిపై ఆస్పత్రి భవనం పెచ్చులూడి పడటంతో ఆమె గాయపడిందని గుర్తుచేశారు.

గాంధీ, ఉస్మానియా ఆస్పత్రుల్లో వైద్య పరికరాలు లేక రోగులుతీవ్ర ఇబ్బం దులు పడుతున్నారని.. వెంటనే ప్రభుత్వం ప్రజలకు కావాల్సిన మందులు, వైద్య పరికరాలు అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

ఉస్మానియా ఆస్పత్రిలో జూనియర్‌ వైద్యులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పని చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేస్తూ.. వైద్యులకు రక్షణ కల్పించాలని కోరారు.

సీఎం కేసీఆర్‌ గతంలో ఆస్పత్రి సందర్శించినప్పుడు వెంటనే నూతన భవనం నిర్మిస్తామని హామీ ఇచ్చారని, కానీ ఆ హామీని ఇప్పటివరకు నెరవేర్చలేదని తెలిపారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Huzurabad Bypolls:Rs.6000 for each vote, villagers stage protest for not giving them
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X