గాలి జనార్దన్ రెడ్డి, బళ్లారి శ్రీరాములు నా రెండు కళ్లు: ఎందుకు పోవాలి, అల్లుడు క్లారిటి!
బెంగళూరు: కర్ణాటక శాసన సభ ఎన్నికల్లో పోటీ చెయ్యడానికి టిక్కెట్ తనకే ఇస్తామని ఇప్పటికే బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బీఎస్. యడ్యూరప్ప చెప్పారు, తాను బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్నాను, నేను ఎందుకు ఈ పార్టీని వదిలి కాంగ్రెస్ పార్టీలో చేరాలని బళ్లారి జిల్లా కంప్లీ నియోజక వర్గం ఎమ్మెల్యే, బళ్లారి ఎంపీ శ్రీరాములుకు వరసకు అల్లుడు అయ్యే సురేష్ బాబు ప్రశ్నిస్తున్నారు. గాలి జనార్దన్ రెడ్డి, శ్రీరాములు నాకు రెండు కళ్లు అని సురేష్ బాబు అన్నారు.

కాంగ్రెస్ లోకి సురేష్ బాబు !
బళ్లారి బీజేపీ ఎం శ్రీరాములు సమీప బంధువు, కంప్లీ శాసన సభ్యుడు సురేష్ బాబు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని సోమవారం మీడియాలో జోరుగా ప్రచారం జరిగింది. ఆనంద్ సింగ్, నాగేంద్రతో పాటు సురేష్ బాబు బీజేపీకి గుడ్ బై చెబుతారని వార్తలు గుప్పుమన్నాయి.
Recommended Video


బీజేపీ కార్యాలయంలో !
బళ్లారిలోని బీజేపీ కార్యాలయంలో మంగళవారం కంప్లీ ఎమ్మెల్యే సురేష్ బాబు మీడియాతో మాట్లాడారు. తాను బీజేపీ టిక్కెట్ తో ఎమ్మెల్యే అయ్యాను. ఇప్పటికీ బీజేపీలోనే ఉన్నాను. మా వెంట ఉన్న కొందరు కాంగ్రెస్ పార్టీలో చేరారని, తాను మాత్రం చేరనని సురేష్ బాబు క్లారిటీ ఇచ్చారు.

నాకు రెండు కళ్లు
కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి, బళ్లారి ఎంపీ శ్రీరాములు నాకు రెండు కళ్లు లాంటి వారు, వారిని మోసం చేసి తాను కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లి ఏం చెయ్యాలి అని సురేష్ బాబు ప్రశ్నించారు. బీజేపీలో తనకు ఎలాంటి ఇబ్బంది లేదని సురేష్ బాబు వివరణ ఇచ్చారు.

ఫోన్ స్విచ్ ఆఫ్
తాను కొన్ని రోజుల క్రితం దేవాలయానికి వెళ్లిన సమయంలో స్వయంగా మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేశానని, ఆ సమయంలో తాను బీజేపీకి దూరం అవుతున్నానని ప్రచారం జరిగిందని, మీడియాలో లేనిపోని వార్తలు వచ్చాయని బీజేపీ ఎమ్మెల్యే సురేష్ బాబు వివరణ ఇచ్చారు.

నేను మాట్లాడలేదు
తాను కొందరు మధ్యవర్తుల సహాయంతో కాంగ్రెస్ పార్టీ నాయకులతో మాట్లాడానని మీడియాలో వచ్చిన వార్తల్లో ఎలాంటి నిజం లేదని, ఎవరో కావాలనే పుకార్లు సృష్టించారని సురేష్ బాబు వివరణ ఇచ్చారు. గాలి జనార్దన్ రెడ్డి, శ్రీరాములు అడుగుజాడల్లోనే బీజేపీలో కొనసాగి, ఎమ్మెల్యేగా గెలిచి ప్రజలకు సేవ చేస్తానని సురేష్ బాబు వివరణ ఇచ్చారు.












Click it and Unblock the Notifications