ట్రంప్‌కు భారత్ బిగ్ షాక్.. రూ.31,500 కోట్ల కీలక ఒప్పందం రద్దు!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల రష్యా నుంచి చమురు దిగుమతులు చేసుకుంటున్నందుకు గానూ ఇండియాపై 50 శాతం సుంకాలు విధిస్తానని ప్రకటించారు. అయితే ఇదే సమయంలో అమెరికా, ఐరోపా దేశాలు కూడా రష్యా నుంచి పెద్ద మొత్తం చమురు, గ్యాస్, ఎరువులను కొనుగోలు చేస్తున్నాయి. ఈ ద్వంద్వ వైఖరిని భారత్ అనేకసార్లు ఎత్తిచూపింది. ట్రంప్ బెదిరింపులకు లొంగకుండా భారత్ గట్టి చర్య తీసుకోవాలని నిర్ణయించుకుంది.
ట్రంప్ ఇండియాపై 50 శాతం సుంకాలు విధిస్తానని బెదిరించినందుకు ప్రతిగా.. భారత్ అమెరికాకు చెందిన బోయింగ్ కంపెనీతో చేసుకున్న రూ.31,500 కోట్ల విలువైన రక్షణ ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ చర్య ట్రంప్ బెదిరింపులకు భారత్ ఇచ్చిన గట్టి జవాబుగా భావించవచ్చు. ఈ పరిణామం బోయింగ్ కంపెనీకి ఆర్థికంగా భారీ నష్టాన్ని కలిగించనుంది. భారత నౌకాదళం కోసం ఆరు పీ-81 పోసిడాన్ నిఘా విమానాలను కొనుగోలు చేయడానికి అమెరికాకు చెందిన బోయింగ్ కంపెనీతో జరపాల్సిన రూ.31,500 కోట్ల ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ విమానాలు హిందూ మమహాసముద్రంలో చైనా కార్యకలాపాలను పర్యవేక్షించడంలో చాలా ముఖ్యమైనవి. ఈ విమానాలు అత్యంత అధునాతన సామర్థ్యాలను కలిగి ఉంటాయి. ఇందులో 350 కిలోమీటర్ల పరిధి గల యాంటీ-షిప్ మిస్సైల్ NASM-MR కూడా ఉంది.

డీల్ వివరాలు, దాని పరిణామాలు
భారత నౌకాదళం ఇప్పటికే 12 P-81 విమానాలను కలిగి ఉంది. వీటిని 2009, 2016లో కొనుగోలు చేశారు. తాజాగా తాత్కాలికంగా నిలిపివేసిన ఈ ఆరు విమానాల డీల్ విలువ మొదట రూ.21,000 కోట్లుగా అంచనా వేయబడినప్పటికీ, జులై 2025 నాటికి అది రూ.31,500 కోట్లకు పెరిగింది. అధిక వ్యయం ఉన్నప్పటికీ ఈ విమానాల అవసరాన్ని గుర్తించిన భారత నౌకాదళం ఈ డీల్‌ను ముందుకు తీసుకెళ్లాలని భావించింది. ట్రంప్ సుంకాల ప్రకటన ఈ డీల్ రద్దుకు దారితీసింది.
ఈ డీల్ రద్దు వల్ల ఎవరికి నష్టం?
ఈ డీల్ రద్దు వల్ల బోయింగ్ కంపెనీకి ఇది ఒక పెద్ద ఆర్థిక నష్టం. ఇండియాలో సుమారు 5 వేల మందికి ఉపాధి కల్పిస్తున్న ఈ సంస్థ భారత ఆర్థిక వ్యవస్థలో రూ.15 వేల కోట్ల వ్యాపారాన్ని నిర్వహిస్తోంది. ఈ చర్య బోయింగ్ వ్యాపారంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.
భారత నౌకాదళంపై ప్రభావం: ఈ నిఘా విమానాల అవసరం ఉన్నప్పటికీ, డీల్ రద్దు చేయడం వల్ల భారత నౌకాదళ సామర్థ్యంపై కొంత ప్రభావం పడవచ్చు. అయితే భారత్ దేశీయంగా నిఘా విమానాలను అభివృద్ధి చేయడానికి డీఆర్డీవో, హెచ్ఏఎల్వంటి సంస్థలతో కలిసి పని చేస్తున్నందున, ప్రభుత్వం ఇప్పుడు స్వదేశీ విమానాలకే ప్రాధాన్యత ఇవ్వవచ్చని భావిస్తున్నారు. ఈ చర్య ద్వారా భారత్ తన జాతీయ ప్రయోజనాల కోసం దృఢమైన నిర్ణయాలు తీసుకోవడానికి వెనుకాడదని అమెరికాకు స్పష్టం చేసింది.












Click it and Unblock the Notifications