LPG: సిలిండర్ రేటు రూ. 1,695.. మనకు ఎంతకు ఇస్తున్నారో తెలుసా?
దేశంలో నిరుపేద మహిళల వంటగదుల్లో స్వచ్ఛమైన వెలుగులు నింపేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 'ప్రధానమంత్రి ఉజ్జ్వల యోజన' పథకం గ్రామీణ జీవితాల్లో గణనీయమైన మార్పులు తెస్తోంది. ఈ పథకం కింద ఉచిత గ్యాస్ కనెక్షన్లు పొందిన లబ్ధిదారులు ఇప్పుడు క్రమం తప్పకుండా సిలిండర్లను రీఫిల్ చేసుకుంటూ వినియోగాన్ని గణనీయంగా పెంచారు.
2021-22 ఆర్థిక సంవత్సరంలో ఒక కనెక్షన్‌పై సగటున ఏడాదికి 3.68 సిలిండర్లు మాత్రమే వాడగా.. 2025-26 నాటికి ఈ సగటు వినియోగం ఏకంగా 4.71 సిలిండర్లకు పెరిగిందని కేంద్ర ప్రభుత్వం శుక్రవారం లోక్‌సభ వేదికగా స్పష్టం చేసింది. పెట్రోలియం శాఖ సహాయ మంత్రి సురేష్ గోపి సభలో అడిగిన ప్రశ్నకు ఇచ్చిన రాతపూర్వక సమాధానంలో ఈ విషయాలను పంచుకున్నారు.

సబ్సిడీ భారం పెరిగినా.. సామాన్యుడిపై భారం పడకుండా!
ప్రపంచవ్యాప్తంగా పశ్చిమాసియా ప్రాంతంలో చెలరేగిన భౌగోళిక ఉద్రిక్తతల వల్ల అంతర్జాతీయంగా ఎల్పీజీ గ్యాస్ ధరలు అమాంతం పెరిగాయి. అంతర్జాతీయ బెంచ్ మార్క్ అయిన సౌదీ సీపీ ధరల్లో ఊహించని మార్పులు రావడం, మన దేశపు మొత్తం గ్యాస్ అవసరాల్లో ఏకంగా 60 శాతానికి పైగా దిగుమతులపైనే ఆధారపడటంతో మార్కెట్ ధరలు ఆకాశాన్నంటాయి.
జూన్ 2026 నాటికి 14.2 కిలోల గృహ వినియోగ సిలిండర్ మార్కెట్ ధర రూ. 1,695కు చేరుకున్నప్పటికీ.. ప్రభుత్వం ప్రతి సిలిండర్‌పై రూ. 700ల వరకు సబ్సిడీ భారాన్ని భరిస్తూ వినియోగదారులకు రూ. 942 కే అందుబాటులో ఉంచింది. ఉజ్జ్వల లబ్ధిదారులకు అదనంగా మరో రూ. 300 సబ్సిడీ ఇస్తూ.. కేవలం రూ. 642 కే సిలిండర్ అందిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు.
దిగుమతుల వైవిధ్యం.. లిమిట్ కుదింపు!
పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో ముడి చమురు సరఫరాలో ఇబ్బందులు ఎదురవకుండా ఉండేందుకు భారత్ తన దిగుమతి వ్యూహాలను మార్చుకుంది. గతంలో 90 శాతం వరకు మిడిల్ ఈస్ట్ దేశాలపైనే ఆధారపడగా, ప్రస్తుతం అమెరికా, కెనడా, అల్జీరియా వంటి ఇతర దేశాల నుంచి కూడా గ్యాస్‌ను దిగుమతి చేసుకుంటోంది. అయితే, అంతర్జాతీయ మార్కెట్లో పెరిగిన విపరీతమైన ధరల భారం దృష్ట్యా జూన్ నెలలో ఉజ్జ్వల పథకం కింద అందించే రాయితీ సిలిండర్ల సంఖ్యను ఏడాదికి తొమ్మిది నుంచి నాలుగుకి కుదిస్తున్నట్లు ప్రభుత్వం నిర్ణయించింది.
ఆయిల్ కంపెనీలకు రూ. 60,000 కోట్ల లోటు!
అంతర్జాతీయ ధరలకు సమానంగా దేశీయంగా ధరలను పెంచకపోవడం వల్ల చమురు మార్కెటింగ్ కంపెనీలు భారీగా ఆర్థిక లోటును ఎదుర్కొంటున్నాయి. 2024-25లో రూ. 41,338 కోట్లుగా ఉన్న ఈ నష్టం, 2025-26 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి ఏకంగా రూ. 60,000 కోట్లకు పెరిగింది. ఈ బకాయిలను సమతుల్యం చేయడానికి ,ఆయిల్ కంపెనీలను నష్టాల నుంచి గట్టెక్కించడానికి కేంద్ర కేబినెట్ ఇప్పటికే రూ. 30,000 కోట్ల పరిపరిహారాన్ని ఆమోదించి విడుదల చేసినట్లు విదేశాంగ, పెట్రోలియం శాఖలు వెల్లడించారు.




Click it and Unblock the Notifications