Vande Bharat Sleeper Train : ఒక్క కోచ్ తయారీకే అన్ని కోట్లా..! మరి ట్రైన్ మొత్తం తయారీకి?
భారతీయ రైల్వే చరిత్రలో మరో అద్భుత ఘటం ఆవిష్కరితం కాబోతుంది. ఇప్పటివరకు పగటి ప్రయాణాలకే పరిమితమైన వందే భారత్ బ్రాండ్, ఇక రాత్రి ప్రయాణాల్లోనూ తన సత్తా చూపించేందుకు సిద్ధమవుతోంది. దేశంలోనే తొలి వందే భారత్ స్లీపర్ ట్రైన్ ఈ నెలలో పట్టాలెక్కనుండటంతో, రైల్వే ప్రయాణికుల్లో ఆసక్తి భారీగా పెరిగింది. హౌరా-గువాహటి మార్గంలో ప్రారంభం కాబోతుంది ఈ సెమీ హైస్పీడ్ స్లీపర్ ట్రైన్. అయితే అసలు ఈ వందే భారత్ స్లీపర్ ట్రైన్ లో ఒక్క కోచ్ తయారీకి ఎంత ఖర్చు అయింది? అనే ప్రశ్న ఆసక్తికరంగా మారింది.
ఈ వందే భారత్ స్లీపర్ ట్రైన్‌ను నార్త్ ఈస్ట్ ఫ్రంటియర్ రైల్వే (NFR) జోన్ నిర్వహించనుండగా, BEML (భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్) సంస్థ దీన్ని తయారు చేసింది. ICF (ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ) టెక్నాలజీతో రూపొందించిన ఈ రైలు, గంటకు 180 కిలోమీటర్ల గరిష్ట వేగాన్ని అందుకోవడం కూడా మనం చూశాం. ఆరెంజ్-గ్రే కలర్ థీమ్‌తో రూపొందిన ఈ ట్రైన్, లుక్ పరంగానూ సంప్రదాయ రైళ్లకు భిన్నంగా ఉంది. ఈ ట్రైన్‌కు సంబంధించి అందరిలోనూ ఆసక్తి కలిగిస్తున్న అంశం ఒక కోచ్ ఖర్చు ఎంత?
మెట్రో కోచ్ తో పోలిస్తే..
రైల్వే మంత్రి వెల్లడించిన వివరాల ప్రకారం, వందే భారత్ స్లీపర్ ట్రైన్‌లోని ఒక్క కోచ్ ధర రూ. 8 నుంచి రూ. 8.5 కోట్ల వరకు ఉంటుందని అంచనా. ఇది మెట్రో రైళ్ల కోచ్‌లతో పోలిస్తే తక్కువే. సాధారణంగా మెట్రో కోచ్‌ల ధరలు రూ. 10 నుంచి రూ. 10.5 కోట్ల వరకు ఉంటాయని అధికారులు చెబుతున్నారు. ఈ ట్రైన్ కోసం BEML మొత్తం 16 కోచ్‌లతో కూడిన 10 ర్యాక్ లను తయారు చేయనుంది.

12 వందే భారత్ స్లీపర్ ట్రైన్ల..
రైల్వే శాఖ ఇప్పటికే వందే భారత్ ట్రైన్ల ఉత్పత్తిని వేగవంతం చేసింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 200కి పైగా వందే భారత్ ట్రైన్లు వివిధ దశల్లో తయారవుతున్నాయి. ఈ క్రమంలోనే 2026 చివరి నాటికి 12 వందే భారత్ స్లీపర్ ట్రైన్లను ప్రవేశపెట్టాలని రైల్వే శాఖ లక్ష్యంగా పెట్టుకుంది.
వావ్ అనిపించే ఫీచర్లు..
ఫీచర్ల విషయానికి వస్తే, ఈ స్లీపర్ ట్రైన్ ప్రయాణికుల అనుభూతిని పూర్తిగా మార్చేలా రూపొందించారు. మొత్తం 16 కోచ్‌లలో, 11 కోచ్‌లు 3 టియర్ AC, 4 కోచ్‌లు 2 టియర్ AC, ఒక కోచ్ ఫస్ట్ ACగా ఉంటాయి. మొత్తం ప్రయాణికుల సామర్థ్యం 823 మంది. ఎర్గోనామిక్ డిజైన్‌తో రూపొందించిన బెర్త్స్, మెరుగైన కుషనింగ్‌తో రాత్రి ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా మార్చనున్నాయి.
సెఫ్టీ అండ్ స్పీడ్..
భద్రత విషయంలోనూ ఎలాంటి రాజీ లేదు. ఈ ట్రైన్‌లో కవచ్ యాంటీ కలిజన్ సిస్టమ్, ఎమర్జెన్సీ టాక్ బ్యాక్ సౌకర్యం, అధునాతన డ్రైవర్ క్యాబిన్ ఏర్పాటు చేశారు. అలాగే ఆటోమేటిక్ డోర్లు, వెస్టిబ్యూల్ కనెక్షన్లు, మెరుగైన సస్పెన్షన్ సిస్టమ్ వల్ల తక్కువ శబ్దంతో సాఫీగా ప్రయాణించే అవకాశం ఉంటుంది. పరిశుభ్రత కోసం ప్రత్యేక డిస్ఇన్ఫెక్షన్ టెక్నాలజీని కూడా అమలు చేశారు.
మొత్తానికి, వందే భారత్ స్లీపర్ ట్రైన్ కేవలం మరో కొత్త రైలు మాత్రమే కాదు. ఇది భారతీయ రైల్వే దీర్ఘదూర రాత్రి ప్రయాణాల ముఖచిత్రాన్ని మార్చే ప్రయత్నంగా చెప్పవచ్చు. స్పీడ్, లగ్జరీ, సేఫ్టీ మూడింటినీ ఒకేసారి అందించే ఈ ట్రైన్, రాబోయే రోజుల్లో ప్రయాణికుల ఫస్ట్ ప్రయారిటీగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications