ఇండిగో కీలక నిర్ణయం.. ఆ దేశాలకు విమాన సర్వీసులు నిలిపివేత
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఏమాత్రం తగ్గడం లేదు. ఇరాన్- అమెరికా మధ్య యుద్ధ వాతావరణం కొనసాగుతూనే ఉంది. యుద్ధం కారణంగా అంతర్జాతీయ చమురు మార్కెట్ పై ప్రభావం పడుతోంది. దాంతో విమాన ఇంధన ధరలు (ఏటీఎఫ్) పెరుగుతున్నాయి. ఇంధన ధరలు పెరగడంతో విమానయాన సంస్థలు నిర్వహణ వ్యయాలను సమతుల్యం చేసుకునేందుకు ప్రయాణికులపై అదనపు ఛార్జీలు విధిస్తున్నాయి. అలాగే అంతర్జాతీయ సేవలను నిలిపివేస్తున్నాయి. అయితే భారత్ లోనే అతిపెద్ద విమానయాన సంస్థ అయిన ఇండిగో కీలక నిర్ణయం తీసుకుంది.
ఆరు అంతర్జాతీయ నగరాలకు నడుపుతున్న తమ విమాన సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. రాబోయే త్రైమాసికంలో విమాన ప్రయాణికుల డిమాండ్ తగ్గడం, నిర్వాహణ ఖర్చులు విపరీతంగా పెరిగిపోయిన నేపథ్యంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు ఇండిగో విమానయాన సంస్థ ప్రకటించింది. నెట్ వర్క్ ఆప్టిమైజేషన్ లో భాగంగా హాంకాంగ్, షాంఘై(చైనా), క్రాబీ(థాయిలాండ్), లాంకావి(మలేషియా), హో చి మిన్ సిటీ(వియత్నాం), సీమ్ రిప్(కాంబోడియా) అంతర్జాతీయ నగరాలను తమ సర్వీసులను నిలిపివేస్తున్నట్లు స్పష్టం చేసింది.
హాంకాంగ్, షాంఘై, క్రాబీ, లంకావి, హో చి మిన్ సిటీలకు జూలై 1 నుంచి సర్వీసులు నిలిచిపోనున్నాయి. అలాగే సీమ్ రీప్ నగరానికి జూలై 3 నుంచి సర్వీసులు ఆగిపోనున్నాయి. ఈ తాత్కాలిక సస్పెన్షన్ సెప్టెంబర్ 30 వరకు అమల్లో ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు మెరుగైతే అంతకంటే ముందే విమానాలను పునరుద్ధరించే అవకాశం ఉందని ఇండిగో ఏవియేషన్ సంస్థ ప్రకటన చేసింది. ఇక ఈ రూట్లలో ప్రయాణించాలనుకునేవారి కోసం అక్టోబర్ 1 నుంచి తిరిగి బుకింగ్స్ ప్రారంభం కానున్నాయి.

మరోవైపు ఈ తాత్కాలిక మార్పుల కారణంగా ఇతర అంతర్జాతీయ సర్వీసులపై ఎలాంటి ప్రభావం పడదని ఇండిగో సంస్థ స్పష్టం చేసింది. ఇండిగో సంస్థ యథావిధిగా వారానికి 1800 లకుపైగా అంతర్జాతీయ విమానాలను నడుపుతుందని ఎయిర్ లైన్స్ సంస్థ పేర్కొంది.












Click it and Unblock the Notifications