స్పృహలోకి వచ్చిన ఇంద్రాణి: ప్రశ్నించడానికి నో
ముంబై: తన కూతురు షీనా బొరా హత్య కేసులో ప్రధాన నిందితురాలు ఇంద్రాణి ముఖార్జియా స్పృహలోకి వచ్చింది. ఆమె ఇటీవల జైలులో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషయం తెలిసిందే. రెండు రోజుల్లో ఆమెను తిరిగి జైలుకు పంపించనున్నారు. ఆదివారంనాడు ఆమె స్పృహలోకి వచ్చింది. దాంతో ఆమె ప్రాణాపాయం నుంచి బయటపడింది.
మలి విడత చికిత్సలో భాగంగా ఇంద్రాణికి నోటి ద్వారా మందులు ఇస్తామని జెజె ఆస్పత్రి డీన్ డాక్టర్ టిపి లహనే పిటిఐ వార్తాసంస్థతో చెప్పారు. డిప్రెషన్ కోసం వాడే మందులను ఎక్కువ మోతాదులో తీసుకోవడంతో ఆమె స్పృహ కోల్పోయింది. దాంతో శుక్రవారంనాడు ఆమెను వెంటే ఆస్పత్రికి తరలించారు.

వైద్యులు చికిత్స అందిస్తున్నందువల్ల ఆమెను పోలీసులు ప్రశ్నించడానికి వీలుండదని లహనే చెప్పారు. అయితే, సోమవారం సాయంత్రం పోలీసులు ఆమెను ప్రశ్నించడానికి వీలుందని అంటున్నారు. మంగళవారం లేదా బుధవారంనాడు ఆమెను తిరిగి జైలుకు తరలించే అవకాశం ఉంది.
కాగా, ఇంద్రాణి జ్యుడిషియల్ కస్టడీని కోర్టు అక్టోబర్ 19వ తేదీ వరకు పొడగించింది. ఇంద్రాణిని ఆస్పత్రిలో కలవడానికి తమకు అనుమతి ఇవ్వాలని ఆమె తరఫు న్యాయవాది శనివారంనాడు కోర్టును కోరారు. ఆమె ఆరోగ్య పరిస్థితిపై కోర్టు ఆస్పత్రిని నివేదిక కోరింది.












Click it and Unblock the Notifications