విజయ్ దెబ్బకు బేజారు! మూడో స్థానంలో..
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు వారం ముందే రాజకీయ వాతావరణం వేడెక్కింది. నాలుగు ప్రధాన పక్షాల మధ్య జరుగుతున్న ఈ చతుర్ముఖ పోటీలో ఎవరు పీఠాన్ని అధిరోహిస్తారనే దానిపై IPDTS సంస్థ సంచలన అంచనాలను వెలువరించింది. మొత్తం 234 నియోజకవర్గాల్లో 35,126 మంది నుంచి సేకరించిన అభిప్రాయాల ప్రకారం.. తమిళనాట మరోసారి 'స్టాలిన్' మార్క్ పాలనకే ప్రజలు పట్టం కట్టబోతున్నారు.
సర్వే ఫలితాల ప్రకారం, ముఖ్యమంత్రి స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే కూటమి తన అధికారాన్ని నిలబెట్టుకోనుంది. డీఎంకే కూటమి.. 138 స్థానాలను కైవసం చేసుకుని స్పష్టమైన మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. ఈ కూటమికి 39.80 శాతం ఓట్ షేర్ దక్కే అవకాశం ఉంది.

అన్నాడీఎంకే-బీజేపీ కూటమి గతంలో కోల్పోయిన వైభవాన్ని తిరిగి తెచ్చుకోవడానికి ఎడప్పాడి పళనిస్వామి తీవ్రంగా శ్రమిస్తున్నా, అది 70 స్థానాలకే పరిమితం కావచ్చని సర్వే పేర్కొంది. వీరికి 33 శాతం ఓట్లు లభించే అవకాశం ఉంది.
విజయ్ ఎంట్రీ: మూడవ శక్తిగా 'టీవీకే'.. కానీ!
తమిళ సినీ స్టార్ విజయ్ స్థాపించిన 'తమిళగ వెట్రి కళగం' (TVK) ఈ ఎన్నికల్లో భారీ ప్రభావాన్ని చూపే అవకాశం ఉందని సర్వే స్పష్టం చేసింది. రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తొలి ప్రయత్నంలోనే విజయ్ మూడవ స్థానానికి ఎగబాకడం విశేషం. అయితే, విజయ్ గణనీయమైన ఓట్లను చీల్చబోతున్నప్పటికీ, అవి సీట్లుగా మారడం కష్టమని IPDTS అంచనా వేసింది. విజయ్ ఎవరి ఓట్లను ఎక్కువగా చీలుస్తారు? సీమాన్ 'నామ్ తమిలర్' పార్టీ ప్రభావం ఎంత? అన్నది ఇప్పుడు అసలైన సస్పెన్స్.
సీమాన్ జోరు.. ఓట్ల విభజన ఎవరికి నష్టం?
సీమాన్ నేతృత్వంలోని 'నామ్ తమిలర్ పార్టీ'కి 8.42 శాతం మద్దతు ఉన్నట్లు సర్వే వెల్లడించింది. విజయ్, సీమాన్ ఇద్దరూ ఒంటరిగానే పోటీ చేస్తుండటంతో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు భారీగా చీలిపోయే అవకాశం ఉంది. ఈ ఓట్ల విభజన పరోక్షంగా అధికార డీఎంకేకు మేలు చేస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
వచ్చే గురువారం జరగనున్న పోలింగ్‌లో ఓటరు నాడి ఎలా ఉంటుందో తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే. ఒకవేళ సర్వే ఫలితాలే నిజమైతే, విజయ్ 'కింగ్' కాలేకపోయినా, రాబోయే రోజుల్లో తమిళ రాజకీయాల్లో బలమైన ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.














Click it and Unblock the Notifications