మోడీకీ అమ్మ లేఖ : ఆర్డినెన్స్ ఓకె, తమిళనాడుకు నీట్ వద్దే వద్దు..
చెన్నై : కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ తో నేషనల్ ఎలిజిబిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) వచ్చే ఏడాదికి వాయిదా పడిన విషయం తెలిసిందే. దీనిపై సంతోషం వ్యక్తం చేస్తూనే, నీట్ పై తమ అభ్యంతరాలను బయటపెట్టారు తమిళనాడు సీఎం జయలలిత.
ఆరోసారి తమిళ పీఠాన్ని అధిష్టించిన జయలలిత, సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తన మొదటి లేఖను ప్రధాని మోడీకి రాశారు. నీట్ పై అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ మోడీకి లేఖ రాసిన జయలలిత, ఈ ఏడాదే కాకుండా భవిష్యత్తులోను తమ రాష్ట్రానికి నీట్ నుంచి మినహాయింపును ఇవ్వాలని లేఖలో పేర్కొన్నారు. మెడికల్, డెంటల్ కోర్సుల్లో ప్రవేశానికి రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరించిన పాత విధానానికే అవకాశమివ్వాలని విజ్ఞప్తి చేశారు.

నీట్ పరీక్ష వల్ల రాష్ట్రాల హక్కులు ఉల్లంఘించబడుతున్నాయని లేఖలో చెప్పుకొచ్చిన జయలలిత, నీట్ తో విద్యార్థులకు న్యాయం జరగదన్నారు. నీట్ పరీక్ష నిర్వహించాల్సిందిగా కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలపై ఎలాంటి ఒత్తిడి తీసుకురావద్దని తెలియజేశారు. ఇవే విషయాలను ప్రస్తావిస్తూ సీఎం జయలలిత మోడీకి లేఖ రాశారు.
తాజా ఆర్డినెన్స్ తో చాలామంది విద్యార్థులకు ఉపశమనం లభించనట్లయిందని, తల్లిదండ్రలపై కూడా ఒత్తిడి తగ్గిందని పేర్కొన్నారు. తమ రాష్ట్రంలోని పేద మధ్య తరగతి ప్రజలకు తమ రాష్ట్ర విద్యా విధానమే ప్రయోజనం కలిగించేదిగా ఉందని, కాబట్టి ఆ పద్దతినే భవిష్యత్తులోను శాశ్వతంగా కొనసాగించేందుకు అవకాశమివ్వాలని జయలలిత ప్రధాని మోడీకి లేఖ ద్వారా విన్నవించారు.












Click it and Unblock the Notifications