రూ. వందల కోట్ల ఆదాయానికి స్కెచ్, విదేశీ లిక్కర్ షాపులకు సీఎం గ్రీన్ సిగ్నల్ ?
బెంగళూరు: ఆదాయాన్ని మెరుగుపరిచే దిశగా ఒక అడుగు ముందుకు వెయ్యాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది. కర్ణాటక ప్రభుత్వానికి చెందిన మైసూర్ సేల్స్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ (ఎంఎస్ఐఎల్) విదేశీ మద్యం విక్రయించడానికి రాష్ట్రవ్యాప్తంగా హైటెక్ అవుట్‌లెట్లను తెరవడానికి సిద్ధం అయ్యిందని తెలిసింది. ఈ అవుట్‌లెట్‌లతో ఏటా రూ. 200 కోట్ల అదనపు ఆదాయాన్ని ఆర్జించాలని ఎంఎస్‌ఐఎల్ భావిస్తోంది.
విశ్వనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ దుకాణాలు రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేట్ మద్యం షోరూమ్‌ల మాదిరిగానే ఉంటాయని, మొదటి దశలో ఎంఎస్ఐఎల్ బెంగళూరులో 10 స్టోర్లను, బెళగావి, మైసూర్, మంగళూరు, దావణగెరె తదితర ఇతర పెద్ద నగరాల్లో రెండు స్టోర్లను, ప్రతి జిల్లా ప్రధాన కేంద్రంలో ఒక ఆధునిక స్టోర్‌ను ప్రారంభించాలని ఆలోచిస్తోంది.

తదుపరి దశలో మరో 40 స్టోర్లను ప్రారంభించాలని అధికారులు యోచిస్తున్నారు. బెంగళూరులో 1,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో, ఇతర జిల్లా కేంద్రాల్లో 1, 000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆకర్షణీయమైన దుకాణాలను ప్రారంభించాలనే ప్రతిపాదనలను అమలు చేస్తున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు.
దీంతో పాటు అనేక ఇతర నగరాల్లో స్థలాన్ని గుర్తిస్తున్నారు. ఈ అవుట్‌లెట్‌లు అంతర్జాతీయ మార్కెట్‌లో అధిక డిమాండ్ ఉన్న స్కాచ్, విస్కీ, వోడ్కా, వైన్ మరియు ఇతర ఆల్కహాల్‌లను విక్రయించడానికి రంగం సిద్దం అయ్యింది. విదేశీ మద్యం విక్రయాలకు మాత్రమే ప్రత్యేక ఔట్ లెట్ లు ప్రారంభించాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించడంతో మద్యం వ్యాపారం చేసే వ్యాపారులు ఇప్పటి నుంచి లాబీలు చేస్తున్నారని తెలిసింది.

ఖరీదైన మద్యం విక్రయాలు ప్రైవేట్ షాపులకే పరిమితం కాకూడదు. సంపన్న వినియోగదారులను ఆకర్షించే దిశగా ఎంఎస్‌ఐఎల్ కృషి చేయాలని పరిశ్రమల శాఖ మంత్రి ఎంబి. పాటిల్ అన్నారు. ఎంఎస్ఐఎల్ ఈ హైటెక్ స్టోర్‌లకు ప్రత్యేకమైన మరియు ఆకర్షణీయమైన పేరు పెట్టాలని కోరుకుంటోందని, ఇప్పుడు ప్రజల సూచనలు, సలహాల కోసం వేచి చూస్తోందని సంబంధిత అధికారులు తెలిపారు. కన్నడిగులు వారి సూచనలు, సలహాలను [email protected]కి పంపించాలని సంబంధిత అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications
