బెంగళూరుకు RRTS- ఈ నాలుగు రూట్లు షార్ట్ లిస్ట్
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ హబ్ గా రూపుదిద్దుకుంటోన్న సిలికాన్ సిటీ బెంగళూరు రూపురేఖలు సమూలంగా మారబోతోన్నాయి. ఓ భారీ రైల్వే స్టేషన్ రాబోతోంది. యలహంక రైల్వే స్టేషన్ ను 6,000 కోట్ల రూపాయలతో పునర్నిర్మించనుంది ప్రభుత్వం. ఇది అందుబాటులోకి వస్తే బెంగళూరులో నాలుగో ప్రధాన టెర్మినల్‌గా మారుతుంది. ప్రస్తుతం క్రాంతివీర సంగోళి రాయణ్ణ, సర్ ఎం విశ్వేశ్వరయ్య, యశ్వంత్ పూర్ తర్వాత అతిపెద్ద టెర్మినల్ గా రూపుదిద్దుకుంటుంది.
ఇక తాజాగా అయిదు రీజినల్ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ (RRTS) కారిడార్లకు అనుమతులు వేగవంతం చేయాలని కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. ఈ ప్రాజెక్టులు నగరంలోని రద్దీని తగ్గించి, శాటిలైట్ టౌన్ల అభివృద్ధి ప్రణాళికలకు తోడ్పడతాయని ఆయన స్పష్టం చేశారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌తో ఆయన భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు పెండింగ్ ప్రాజెక్టుల గురించి చర్చించారు.

దేశంలోనే మొదటి కారిడార్ అయిన ఢిల్లీ-మీరట్ ఆర్ఆర్టీఎస్ విజయవంతమైన నేపథ్యంలో అదే తరహా రవాణా వ్యవస్థను బెంగళూరు మంజూరు చేయాలని ఆయన కోరారు. దీనికి సంబంధించి నాలుగు రూట్లను కూడా కర్ణాటక ప్రభుత్వం ఎంపిక చేసింది. వాటిని ఈ ప్రతిపాదనల్లో పొందుపర్చింది. బిడది- మైసూరు, హారోహళ్లి- కనకపుర, నేలమంగళ- తుమకూరు, బెంగళూరు ఎయిర్ పోర్ట్- చిక్‌బళ్లాపూర్, హోస్కోటె- కోలార్ మధ్య ఆర్ఆర్టీఎస్ కారిడార్లను ఏర్పాటు చేయాలని కేంద్రానికి ప్రతిపాదనలు పంపారు.
ప్రస్తుతం ఢిల్లీ- మీరట్ మధ్య ఈ రైళ్లు అందుబాటులో ఉన్నాయి. దూర ప్రాంతాల మధ్య ఇవి రాకపోకలు సాగించవు. మల్టీ మోడల్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్ (ఎంఎంటీఎస్) తరహాలో రీజనల్ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ (ఆర్‌ఆర్టీఎస్) కారిడార్‌లలో మాత్రమే ఈ రైళ్లు పరుగులు పెడతాయి. ఇవి రైల్వే మంత్రిత్వ శాఖ పరిధిలో ఉండవు. వీటిని పర్యవేక్షించడానికి ప్రత్యేకంగా ఓ కార్పొరేషన్‌ను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
తొలి సెమీ హైస్పీడ్ ఆర్ఆర్టీఎస్ రైలు ఢిల్లీ-ఘజియాబాద్-మీరట్ రీజియన్ పరిధిలో అందుబాటులోకి వచ్చింది. 82 కిలోమీటర్ల కారిడార్ ఇది. ఈ రైలుకు ర్యాపిడ్ ఎక్స్ (RapidX) అని పేరు పెట్టారు. నేషనల్ క్యాపిటల్ రీజియన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (ఎన్సీఆర్టీసీ) ఈ రైలు సర్వీసులను పర్యవేక్షిస్తుంది. దేశంలో ఆర్ఆర్టీఎస్ వ్యవస్థ కింద ప్రవేశపెట్టబోయే మొట్టమొదటి సెమీ హైస్పీడ్ ఎక్స్‌ప్రెస్ ఇదే. ర్యాపిడ్ ఎక్స్ అనే బ్రాండ్ నేమ్ మీదే వివిధ రీజియన్ల మధ్య దశలవారీగా ఈ రైళ్లు పరుగులు పెట్టనున్నాయి.












Click it and Unblock the Notifications