Lilavati Hospital: క్షుద్ర పూజలు, రూ.1200 కోట్ల స్కాం.. ట్రస్టీల సంచలన ఆరోపణలు
Lilavati Hospital: ముంబైలోని ప్రసిద్ధ లీలావతి హాస్పిటల్ ఆస్పత్రి ఆవరణలో చేతబడి ఆచారాలు నిర్వహిస్తున్నట్లు ఆధారాలు లభించాయని ట్రస్టీలు పేర్కొన్నారు. ప్రస్తుత ట్రస్టీల కార్యాలయం అంతస్తు కింద మానవ ఎముకలు, పుర్రెలు, వెంట్రుకలు, బియ్యం, తాంత్రిక పద్ధతులకు సంబంధించిన ఇతర వస్తువులు ఉన్న ఎనిమిది కలశాలు దొరికాయని వెల్లడించారు. లీలావతి ఆసుపత్రి మాజీ ట్రస్టీలు నిధుల దుర్వినియోగం చేశారని గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. నకిలీ ఆర్డర్లు, రికార్డుల ద్వారా మాజీ ట్రస్టీలు రూ.1200 కోట్లకు పైగా స్వాహా చేశారనే ఆరోపణలతో ప్రస్తుత ఆస్పత్రి ట్రస్టీలు దుర్వినియోగం కేసు దాఖలు చేశారు. అనంతరం మాజీ ట్రస్టీలు ఈ ఆరోపణలను నిరాధారమైనవని.. దురుద్దేశంతో కూడినవి అని తోసిపుచ్చారు.
లీలావతి హాస్పిటల్ వ్యవస్థాపకుడు కిషోర్ మెహతా సోదరుడు విజయ్ మెహతా, అతని బంధువులు, సహచరులపై ఆర్థిక అవకతవకలకు పాల్పడినట్లు మూడు ఎఫ్ఐఆర్ లు నమోదయ్యాయి. ఇదే కాకుండా.. మాజీ ట్రస్టీలపై పన్ను ఎగవేత, దొంగతనం ఫిర్యాదులు కూడా నమోదయ్యాయి. మరోవైపు ప్రస్తుత ట్రస్టీలు ప్రశాంత్ మెహతా, అతని తల్లి చారు మెహతాకు హాని కలిగించడానికి మాజీ ట్రస్టీలు చేతబడి పద్ధతులను ఉపయోగించినట్లు ఆధారాలతో సహా తాజాగా ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర యాంటీ బ్లాక్ మ్యాజిక్ నిరోధక చట్టం కిందని మరో కేసు నమోదైంది.

అయితే ఈ ఆరోపణలను విజయ్ మెహతా కుమారుడు చేతన్ మెహతా ఖండించారు. చేతబడి ఆరోపణలు సమాధానం చెప్పడానికి కూడా విలువైనవి కాదని.. కేవలం సంచలనం సృష్టించేందుకే ప్రస్తుత ట్రస్టీలు అలాంటి ఆరోపణలు చేస్తున్నారని అన్నారు.
అధికారుల ప్రకారం.. కిషోర్ మెహతా 2002లో చికిత్స కోసం విదేశాలకు వెళ్లాడు. ఈ కాలంలో ఆయన సోదరుడు విజయ్ మెహతా ట్రస్ట్ తాత్కాలిక బాధ్యతలను చేపట్టారు. విజయ్ మెహతా తన కుమారులు, మేనల్లుళ్లను ట్రస్టీలుగా నియమించడానికి పత్రాలు, సంతకాలను నకిలీ చేశారని.. కిషోర్ మెహతాను శాశ్వత ట్రస్టీ పదవి నుంచి తొలగించినట్లు ఆరోపణలు ఉన్నాయి. సుదీర్ఘ న్యాయ పోరాటం తర్వాత కిషోర్ మెహతా 2016 సంవత్సరంలో తన పదవిని తిరిగి పొందారు. 2024లో కిషోర్ మెహతా మరణం తర్వాత ఆయన కుమారుడు ప్రశాంత్ మెహతా శాశ్వత ట్రస్టీ అయ్యాడు. ప్రశాంత్ ఖాతాలపై ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించారు. ఈ క్రమంలో నిధుల దుర్వినియోగంతో పాటు సుమారు రూ.1500 కోట్ల మేర ఆర్థిక అవకతవలు బయటపడటంతో మాజీ ట్రస్టీలపై కేసులు నమోదు అయ్యాయి.












Click it and Unblock the Notifications