ఎన్నికలు: ఎపిలో ఏప్రిల్ 30, మే 7న, అప్పుడే అసెంబ్లీ
న్యూఢిల్లీ: ప్రధాన ఎన్నికల కమిషనర్ విఎస్ సంపత్ సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ను బుధవారం విడుదల చేశారు. తొమ్మిది విడతల్లో జరగనున్న లోకసభ ఎన్నికలు... మన రాష్ట్రంలో రెండు విడతల్లో జరగనున్నాయి. లోకసభతో పాటే అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. ఏప్రిల్ 30, మే 7వ తేదీల్లో ఎపిలో ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్ 30న తెలంగాణలో, మే 7న సీమాంధ్రలో ఎన్నికలు జరుగుతాయి.
15వ లోకసభ కాలపరిమిది జూన్ 1తో ముగియనున్న నేపథ్యంలో ఈ లోపల ఎన్నికల ప్రక్రియ ముగిసేలా ఈ షెడ్యూల్ ఉంది. ఈసారి లోకసభ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, సిక్కిం రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. మే 31వ తేదీ లోపు కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేలా ఈసి కసరత్తు చేసింది.

ఆంధ్రప్రదేశ్ శాసన సభ కాలపరిమితి జూన్ 2తో ముగియనుంది. తొలిసారి లోకసభ ఎన్నికల్లో తిరస్కరణ ఓటు (నోటా) అమల్లోకి వస్తోంది. కొన్ని నియోజకవర్గాల్లో ఓటింగ్ ముద్రణ ప్రతి ఇచ్చే ఏర్పాటు చేయనున్నారు. ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయడంతో దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చింది.
విఎస్ సంపత్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వివిధ రాష్ట్రాల్లో విద్యార్థుల పరీక్షలను దృష్టిలో పెట్టుకొని ఎన్నికల ప్రక్రియను రూపొందించామన్నారు. పూర్తి పారదర్శక ఎన్నికల కోసం ముమ్మరంగా కసరత్తు చేశామని, ఎన్నికల విషయమై ఆయా రాష్ట్రాల డిజిపి, సిఎస్‌లను సంప్రదించామన్నారు. 2009 ఎన్నికలతో పోలిస్తే ఈసారి పదికోట్ల మంది కొత్త ఓటర్లు ఉన్నారు.
ఓటరుగా మరో అవకాశం
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఓటరుగా నమోదు చేసుకునేందుకు మరో అవకాశం కల్పిస్తున్నట్లు సంపత్ చెప్పారు. ఆయా ప్రాంతాల్లో ఓటర్లుగా నమోదు చేసుకునేందుకు ప్రత్యకే శిబిరాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. మార్చి 9న అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఓటరుగా నమోదు చేసుకునే అవకాశముంటుందన్నారు. ఆ రోజున బూత్ స్థాయి అధికారులు అందుబాటులో ఉంటారని, ఓటరుగా నమోదు చేసుకోవాలని సంపత్ సూచించారు.
లోకసభ అభ్యర్థి ఎన్నికల ఖర్చు రూ.70 లక్షలు
లోకసభ అభ్యర్థి ఎన్నికల ఖర్చు పరిమితి రూ.70 లక్షలు. దేశవ్యాప్తంగా 9.3 లక్షల పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. దేశంలో 81.4 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. 2009 ఎన్నికలతో పోలిస్తే ఈసారి పదికోట్ల మంది కొత్త ఓటర్లు ఉన్నారు.
తొమ్మిది విడతల్లో...
మొదటి విడత ఏప్రిల్ 7న, రెండో విడత ఏప్రిల్ 9న, మూడో విడత ఏప్రిల్ 10, నాలుగో విడత ఏప్రిల్ 12న, ఐదో విడత ఏప్రిల్ 17, ఆరో విడత ఏప్రిల్ 24న, ఏడో విడత ఏప్రిల్ 30న, ఎనిమిదో విడత మే 7న, తొమ్మిదో విడత మే 12న ఎన్నికలు జరగనున్నాయి. మే 16న ఓట్ల లెక్కింపు, ఫలితాలు ఉంటాయి.












Click it and Unblock the Notifications