రాహుల్ గాంధీ నామినేషన్: ఆ నియోజకవర్గం నుంచే లోక్‌సభ బరిలో..
Wayanad Lok Sabha: లోక్‌సభ ఎన్నికల పోలింగ్ గడువు సమీపిస్తోన్న నేపథ్యంలో నామినేషన్ల దాఖలు ప్రక్రియ ఊపందుకుంటోంది. రెండో విడత పోలింగ్ ఈ నెల 26వ తేదీన షెడ్యూల్ చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. కేరళలోని 20 లోక్‌సభ నియోజకవర్గాలకు ఒకేదశలో పోలింగ్ ముగస్తుంది.
కేరళలోని వాయనాడ్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి వరుసగా రెండోసారి ఎన్నికల బరిలో నిలిచారు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ మాజీ అధినేత రాహుల్ గాంధీ. 2019 నాటి ఎన్నికల్లో ఆయన ఇక్కడి నుంచే విజయం సాధించిన విషయం తెలిసిందే. తన సమీప ప్రత్యర్థి, సీపీఐ అభ్యర్థి పీపీ సునీర్‌ను నాలుగు లక్షలకు పైగా ఓట్ల తేడాతో ఓడించారు.

ఇప్పుడు కూడా ఆయన వాయనాడ్ నుంచే పోటీకి మొగ్గు చూపారు. కొద్దిసేపటి కిందటే రాహుల్ గాంధీ నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. ఈ ఉదయం ఆయన తన చెల్లెలు ప్రియాంక గాంధీ వాద్రా, పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో కలిసి వాయనాడ్‌కు చేరుకున్నారు. భారీ ర్యాలీని నిర్వహించారు.
అనంతరం- రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి వెళ్లి తన నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. ఆ సమయంలో ప్రియాంక గాంధీ వాద్రా, కేసీ వేణుగోపాల్ రాహుల్ గాంధీ వెంట ఉన్నారు. రెండు రోజుల పాటు రాహుల్ గాంధీ ఇక్కడే ఉండనున్నారు. ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటారు.
కాగా ఈ ఉదయమే వాయనాడ్ సీపీఐ అభ్యర్థిగా ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి డీ రాజా భార్య అన్ని రాజా తన నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. అన్ని రాజా.. ప్రస్తుతం భారత జాతీయ మహిళా సమాఖ్య ప్రధాన కార్యదర్శిగా పని చేస్తోన్నారు. సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలిగా వ్యవహరిస్తోన్నారు. ఈ ఎన్నికల్లో వాయనాడ్ నుంచి సీపీఐ అభ్యర్థిగా పోటీలో నిలిచారు.












Click it and Unblock the Notifications