Anti Paper Leak Bill: యాంటీ పేపర్ లీక్ బిల్లుకు లోక్ సభ ఆమోదం
నీట్, జేఈఈ వంటి పబ్లిక్ పరీక్షల్లో జరుగుతున్న ప్రశ్నపత్రాల లీకేజీలు, అక్రమాలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 'పబ్లిక్ పరీక్షల (అక్రమాల నిరోధక) సవరణ బిల్లు, 2026' (యాంటీ పేపర్ లీక్ బిల్లు)కు లోక్ సభ తాజాగా ఆమోదం తెలిపింది. మూజువాణి ఓటుతో యాంటీ పేపర్ లీక్ బిల్లుకు ఆమోదం తెలిపింది. రెండు రోజుల పాటు ఈ బిల్లుపై వాడీవేడీగా చర్చలు జరిగాయి. అధికార, విపక్ష సభ్యుల వాగ్వాదంతో లోక్ సభలో ఒకింత గందరగోళం నెలకొంది. చర్చ అనంతరం మూజువాణి ఓటుతో బిల్లుకు లోక్ సభ ఆమోద ముద్ర వేసింది. ఈ మేరకు లోక్ సభ గురువారానికి వాయిదా వేసింది.
యాంటీ పేపర్ లీక్ బిల్లుపై లోక్ సభలో దాదాపు 10 గంటలపాటు చర్చ జరిగింది. అధికార- ప్రతిపక్ష సభ్యులు ఈ బిల్లుపై ప్రసంగించారు. చర్చ సందర్భంగా ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రసంగంపై సభలో ఒకింత గందరగోళం నెలకొంది. ఆయన ఇడియట్ వ్యాఖ్యలు వివాదానికి దారి తీశాయి. అలాగే విద్యాశాఖను ఆర్ఎస్ఎస్ నడుపుతోందని రాహుల్ గాంధీ కీలక ఆరోపణలు చేశారు. అంతేకాక ఈ సంస్థ విద్యార్థులను అంధభక్తులుగా మార్చాలని చూస్తోందని విమర్శించారు. అయితే రాహుల్ వ్యాఖ్యలపై అధికార పక్ష ఎంపీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

ఇక నీట్ పేపర్ లీక్ అంశం దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. పేపర్ లీక్ అంశంపై కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) పెద్ద ఉద్యమమే చేసింది. దేశ రాజధాని దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద దాదాపు నెల రోజుల పాటు నిరసనలు చేపట్టింది. ఈ ఆందోళనల్లో భాగంగా ప్రముఖ పర్యావరణవేత్త సోనమ్ వాంగ్ చుక్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. ఇటీవల సీజేపీ ఆందోళనలు ఉద్ధృతం అయిన నేపథ్యంలో నీట్ పేపర్ లీక్ అంశానికి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆయన స్థానంలో ప్రహ్లాద్ జోషీకి కేంద్రం బాధ్యతలు అప్పగించింది. దాంతో సీజేపీ నిరసనలను విరమించుకుంది.












Click it and Unblock the Notifications