మహారాష్ట్రలోని "మల్షేజ్ ఘాట్".. ప్రకృతి ప్రేమికులకు స్వర్గధామం.. ఎలా చేరుకోవాలి..?
మహారాష్ట్రలో అనేక ప్రకృతి రమణీయమైన ప్రదేశాలు ఉన్నాయి. చారిత్రక కట్టడాలు.. పర్యాటక ప్రదేశాలు.. కోటలు, గుహలు, హిల్ స్టేషన్స్, ప్రముఖ పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. మహారాష్ట్రలో అజంతా గుహలు, ఎల్లోరా గుహలు, రాయ్ గఢ్ కోటకు గణనీయమైన చరిత్ర ఉంది. అలాగే మహాబలేశ్వర్, మత్తేరాన్, లోనావాలా అనే హిల్ స్టేషన్స్ ప్రకృతి ప్రేమికులకు స్వర్గధామంగా ఉన్నాయి. ఇక పుణ్యక్షేత్రాలుగా షిర్డీ, నాసిక్, సిద్ధి వినాయక ఆలయం గురించి ఎంత చెప్పినా తక్కువే. అందుకే మహారాష్ట్ర టూర్ వేసేందుకు చాలామంది ఇష్టపడుతుంటారు. అయితే మహారాష్ట్ర టూరిజంలో ముఖ్యమైనది "మల్షేజ్ ఘాట్".. ప్రకృతి ప్రేమికులకు ఇది స్వర్గధామంగా ఉంది. మహారాష్ట్రలోని పశ్చిమ కనుమలలో ఈ ప్రాంతం దాగి ఉంది. ఈ ఘాట్ సముద్ర మట్టానికి సుమారు 700 మీటర్ల ఎత్తులో ఉంది.
పుణె నుంచి మల్షేజ్ ఘాట్ సుమారు 120 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక ముంబై నుంచి అయితే 154 కిలోమీటర్ల దూరంలో ఉంది. ముఖ్యంగా మల్షేజ్ ఘాట్ ట్రెక్కింగే చేసే వారికి, ప్రకృతి మధ్యలో ఆహ్లాదంగా విహరించాలనుకునేవారికి.. పక్షులను చూస్తూ ఎంజాయ్ చేసేవారికి.. ప్రకృతి ఒడిలో సేద తీరాలనుకునేవారికి బెస్ట్ టూరిస్ట్ స్పాట్ గా ఉంది. మల్షేజ్ ఘాట్ లో కొండలు, లోయలు, జలపాతాలు, సరస్సులు, అడవులు ఇలా అన్నీ ఉన్నాయి. మల్షేజ్ ఘాట్ లో ముఖ్యమైన ప్రాంతాలు చూస్తే.. మల్షేజ్ జలపాతం.. ఇది 150 మీటర్ల ఎత్తు నుంచి జాలువారుతుంది. ఇక్కడి పొగమంచుతో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. వర్షాకాలంలో ఈ జలపాతం అందాలు చూసేందుకు చాలామంది పర్యటకులు వస్తుంటారు.

అలాగే ఇక్కడికి సమీపంలో పింపల్ గావ్ జోగా డ్యామ్ ఉంది. ఇది ఒక పెద్ద జలాశయం. ఇక్కడికి ఫ్లెమింగోలు, కొంగలు, సారస పక్షులు, హెరాన్ లు, ఎగ్రేట్ లు, బాతులు తదితర పక్షులను వీక్షించవచ్చు. ఇక హరిశ్చంద్ర గఢ్ కోట చాలా పురాతనమైనది. ఈ కోట ఓ కొండపై ఉంటుంది. ఇక్కడి నుంచి ప్రకృతి దృశ్యాలు చాలా అద్భుతంగా ఉంటాయి. అలాగే అజోబా కొండ, కొంకణ్ కడ, తారామతి వ్యూ పాయింట్ కూడా ఇక్కడ చాలా ఫేమస్.. ఇక పుణె అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఈ ప్రాంతం 120 కిలోమీటర్ల దూరంలో ఉంది. రోడ్డు మార్గం అయితే ముంబై, పుణె, నాసిక్, థాణె నుంచి మల్షేజ్ ఘాట్ కు చేరుకోవచ్చు. మల్షేజ్ ఘాట్ కు అత్యంత సమీపంలోని రైల్వే స్టేషన్ కళ్యాణ్ జంక్షన్ ఉంది.












Click it and Unblock the Notifications