మమత లేని ఇండియాను ఊహించలేం: ఆందోళనలో కాంగ్రెస్.. !!
Mamata Banerjee: ప్రతిపక్షాల ఉమ్మడి కూటమి ఇండియా నుంచి వైదొలగుతున్నట్లు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమత బెనర్జీ చేసిన ప్రకటన కలకలం రేపుతోంది. సార్వత్రిక ఎన్నికల్లో బలమైన భారతీయ జనతా పార్టీని ఎదుర్కొడానికి సమాయాత్తమౌతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఆమె తీసుకున్న ఈ నిర్ణయం కూటమిని కలవరపాటుకు గురి చేస్తోంది.
లోక్‌సభ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయనున్నట్లు మమత బెనర్జీ ఈ ఉదయమే ప్రకటించి విషయం తెలిసిందే. కాంగ్రెస్‌తో సీట్ల పంపకాల మధ్య ఏకాభిప్రాయం కుదరట్లేదని, ఇప్పటివరకూ కొనసాగిన చర్చల్లో ఏకాభిప్రాయానికి రాలేకపోతున్నామని అన్నారు. తమ ప్రతిపాదనలను కాంగ్రెస్ తోసిపుచ్చిందనీ వెల్లడించారు.

దీనిపై అఖిల భారత కాంగ్రెస్ కమిటీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కేంద్ర మాజీమంత్రి జైరామ్ రమేష్ మాట్లాడారు. మమత బెనర్జీ లేని కూటమిని ఊహించలేమని వ్యాఖ్యానించారు. కూటమికి మమత మూల స్తంభంగా ఉన్నారంటూ ఇదివరకు రాహుల్ గాంధీ అభివర్ణించారని జైరామ్ రమేష్ అన్నారు.
తన నిర్ణయాన్ని పునఃసమీక్షించుకోవాలని మమత బెనర్జీని కోరుతున్నట్లు తెలిపారు. సీట్ల పంపకాలపై ఈ రెండు పార్టీల మధ్య చర్చలు ఫలప్రదం కావాలని కోరుకుంటోన్నట్లు జైరామ్ రమేష్ చెప్పారు. మమత బెనర్జీని గానీ వదులుకోవడానికి ఇండియా సిద్ధంగా లేదని తేల్చి చెప్పారు.
సీట్ల పంపకాలపై మరో విడత చర్చలను చేపట్టాల్సిన అవసరం ఉందని, ఈ దిశగా చర్యలు తీసుకుంటామని అన్నారు. దేశంలో నియంతృత్వ వైఖరికి తెర పడటానికి, ప్రజాస్వామ్యయుత వాతావరణం నెలకొనడానికి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ/ఎన్డీఏ కూటమిని ఓడించాల్సిన అవసరం ఉందంటూ మమత బెనర్జీ గతంలో చేసిన వ్యాఖ్యానించారని గుర్తు చేశారు.
పశ్చిమ బెంగాల్ లోక్‌సభ ఎన్నికల్లో తాము ఇండియా కూటమి తరఫున పోటీ చేస్తామనే ధీమా తనకు ఉందని జైరామ్ అన్నారు. మమత బెనర్జీ తన నిర్ణయాన్ని మార్చుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. బీజేపీని ఓడించడానికి అందుబాటులో ఉన్న ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదులుకోవడానికి సిద్ధంగా లేమని చెప్పారు.












Click it and Unblock the Notifications