టైమ్‌కు లంచ్ పెట్టలేదని భార్యను పొడిచి చంపేశాడు
న్యూఢిల్లీ: చిన్న కారణానికి ఓ ప్రబుద్ధుడు భార్యను కత్తితో పొడిచి చంపాడు. ఈ సంఘటన ఢిల్లీలోని సీమాపూరిలో మంగళవారం చోటు చేసుకుంది. సమయానికి మధ్యాహ్న భోజనం పెట్టలేదని భార్యను పొడిచిన చంపిన ఆ దుర్మార్గుడు ఆమె శవాన్ని బాల్కనీ నుంచి కిందికి పడేసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు.
ఇరుగుపొరుగువారు గమనించి అతన్ని పోలీసులకు పట్టిచ్చారు. మంజు (20) భోజనాలు వండుతుండగా భర్త గౌతం (25) వంటింట్లోకి వచ్చి భోజనం పెట్టాలని అడిగాడు. వంట అయిపోయిన తర్వాత పెడుతానని మంజు చెప్పింది. దాంతో అతని కోపం కట్టలు తెంచుకుంది. ఆమెను కొట్టడం ప్రారంభించాడు. కత్తితో పొడిచాడు. గొంతుపై, కడుపులో అతను కత్తితో పొడిచాడు.

రక్తం ఓడుతూ మంజు కింద పడిపోయింది. దాంతో ఆమె శరీరాన్ని మొదటి అంతస్థు బాల్కనీలోకి లాక్కొచ్చాడు. ఆత్మహత్యగా చిత్రీకరించడానికి కిందికి తోసేయాలని చూశాడు. మంజు సాయం కోసం పెట్టిన కేకలు వినడంతో ఇరుగుపొరుగువారు బయటకు వచ్చారు.
ఒకరు ఫ్లాట్‌లోకి ప్రవేశించి అతన్ని పట్టుకున్నాడు. మంజును వెంటనే జిటిబి ఆస్పత్రికి తరలించారు. ఆమె అప్పటికే మరణించినట్లు వైద్యులు చెప్పారు. దీంతో ఇరుగుపొరుగువారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దాంతో పోలీసులు గౌతమ్‌ను అరెస్టు చేశారు.












Click it and Unblock the Notifications