కలిసి పనిచేద్దాం: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలిసిన మంచు విష్ణు
తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(MAA) అధ్యక్షుడు మంచు విష్ణు మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయన వెంట మా ప్రధాన కార్యదర్శి రఘుబాబు, కోశాధికారి శివ బాలాజీ ఉన్నారు. ఈ సందర్భంగా డిప్యటీ సీఎంను శాలువాతో సత్కరించి, చిత్ర పరిశ్రమ తరపున బహుమతి అందజేశారు మంచు విష్ణు. అనంతరం పలు అంశాలపై చర్చించారు.
డిప్యూటీ సీఎంతో భేటీకి సంబంధించిన విషయాన్ని తెలియజేస్తూ సోషల్ మీడియా వేదికగా ఫొటోను పంచుకున్నారు మంచు విష్ణు. భట్టి విక్రమార్కను కలుసుకోవడం ఆనందంగా ఉంది. మేం పలు విషయాలపై చర్చించాం. తెలుగు చిత్ర పరిశ్రమ తరపున డ్రగ్స్ వ్యతిరేక ప్రచార కార్యక్రమాల గురించి ప్రత్యేకంగా మాట్లాడాం అని విష్ణు తెలిపారు.

క్లిష్ట పరిస్థితుల్లో డ్రగ్స్ ఫ్రీ సొసైటీ కోసం ప్రయత్నిస్తున్న ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు మంచు విష్ణు. అందరం కలిసి డ్రగ్స్ రహిత సమాజానికి కృషి చేద్దామని ఆయన పిలుపునిచ్చారు. కాగా, తెలంగాణ ప్రభుత్వం డ్రగ్స్, మత్తు పదార్థాలు వాడకం, విక్రయాలపై ఉక్కుపాదం మోపుతున్న విషయం తెలిసిందే.
ప్రస్తుతం మంచు విష్ణు.. అంతర్జాతీయ ప్రమాణాలతో తెరకెక్కుతున్న 'కన్నప్ప'లో నటిస్తున్నారు. కొన్ని రోజుల క్రితమే న్యూజిలాండ్‌లో భారీ షెడ్యూల్ షూటింగ్ పూర్తి చేశారు. ఈ సినిమాలో ప్రభాస్, మోహన్ లాల్, శరత్ కుమార్, మోహన్ బాబు, బహ్మానందం లాంటి అగ్రనటులు కీలక పాత్రలో కనిపించనున్నారు.












Click it and Unblock the Notifications