వరుడు కావలెను అని నమ్మించి.. కోట్లు వసూలు చేసిన కిలేడీలు!
Matrimonial Fraud: మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో భారీ మ్యాట్రిమోనియల్ మోసం వెలుగులోకి వచ్చింది. పెళ్లి పేరుతో అమాయక యువకులను బురిడీ కొట్టిస్తున్న రెండు నకిలీ కాల్ సెంటర్లను క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఛేదించారు. ఈ ఆపరేషన్‌లో భాగంగా 20 మంది యువతులను అదుపులోకి తీసుకోగా, నిర్వాహకులుగా ఉన్న మరో ఇద్దరు మహిళలను అరెస్ట్ చేశారు.
అందమైన అమ్మాయిల ఫోటోలను చూపిస్తూ, పెళ్లి చేసుకుంటామని నమ్మించి లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్న ముఠాను గ్వాలియర్ పోలీసులు పట్టుకున్నారు. థాటిపూర్ ప్రాంతంలోని మయూర్ నగర్, జ్యోతి నగర్ ఏరియాల్లో ఈ కాల్ సెంటర్లు గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్నాయి.

ఎలా మోసం చేసేవారంటే?
ఇంటర్నెట్ నుంచి మోడల్స్, అందమైన అమ్మాయిల ఫోటోలను డౌన్లోడ్ చేసి నకిలీ ప్రొఫైల్స్ క్రియేట్ చేసేవారు. పెళ్లి సంబంధం కుదిరిందని నమ్మించి, రిజిస్ట్రేషన్ ఫీజు, వెరిఫికేషన్ ఛార్జీల పేరుతో క్యూఆర్ కోడ్ పంపి డబ్బులు వసూలు చేసేవారు. పోలీసులకు దొరకకుండా ఉండడానితి అక్కడ పని చేసే మహిళలకు కేవలం సాధారణ కీప్యాడ్ ఫోన్లు మాత్రమే ఇచ్చేవారు. వాటిలో వాట్సాప్ లేదా సోషల్ మీడియా ఉండేది కాదు. బాధితుల నుంచి పెద్ద మొత్తంలో డబ్బు అందిన వెంటనే ఆ నంబర్లను స్విచ్ఛాఫ్ చేసేవారు.
పోలీసుల దాడులు - కీలక వివరాలు:
మొదటి కాల్ సెంటర్‌ను టైలేశ్వర్ పటేల్ అనే వ్యక్తి ఇంట్లో గుర్తించారు. ఇక్కడ 12 మంది యువతులు పని చేస్తుండగా, రాఖీ గౌర్ అనే మహిళ దీనిని నిర్వహిస్తోంది. జ్యోతి నగర్ దాడిలో సీత అలియాస్ శీతల్ చౌహాన్ అనే మహిళ నేతృత్వంలో ఏడుగురు యువతులు మోసాలకు పాల్పడుతున్నారు. ఘటనా స్థలం నుండి పోలీసులు ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్లు, మొబైల్ ఫోన్లు, రిజిస్టర్లు, సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు.
కోటిన్నర వరకు దోపిడీ
ప్రాథమిక విచారణ ప్రకారం, ఈ ముఠా ఇప్పటివరకు సుమారు 1,500 మందికి పైగా యువకులను మోసం చేసి, 1.5 కోట్ల రూపాయల వరకు వసూలు చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ముఠా ప్రధాన సూత్రధారి టైలేశ్వర్ పటేల్ పరారీలో ఉన్నాడు. అతని కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ముఠా నెట్‌వర్క్ ఎంతవరకు విస్తరించి ఉందో తెలుసుకోవడానికి పోలీసులు బ్యాంక్ ఖాతాలను, డిజిటల్ రికార్డులను పరిశీలిస్తున్నారు. ఆన్‌లైన్ మ్యాట్రిమోనియల్ సైట్లలో పెళ్లి సంబంధాలు చూసేవారు అప్రమత్తంగా ఉండాలి. ఎవరైనా ఫోన్ చేసి డబ్బులు అడిగితే వెంటనే నమ్మవద్దని పోలీసులు సూచిస్తున్నారు.












Click it and Unblock the Notifications