శుక్రవారం ప్రపంచం దృష్టి అంతా మన వైపే! మోదీ-పుతిన్ భేటీ
ప్రపంచ దేశాల చూపు మరోసారి భారత్, రష్యాల వైపు మళ్లింది. అంతర్జాతీయ రాజకీయాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, గ్లోబల్ ఆర్థిక వ్యవస్థ , దౌత్య సంబంధాల నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మధ్య శుక్రవారం కీలక ద్వైపాక్షిక చర్చలు జరగనున్నాయి. ఇరు దేశాల మధ్య వాణిజ్య బంధం, అంతర్జాతీయ రవాణా ప్రాజెక్టులతో పాటు ముఖ్యంగా సుదీర్ఘంగా సాగుతున్న ఉక్రెయిన్ యుద్ధానికి శాంతియుత ముగింపు పలకడమే లక్ష్యంగా ఈ భేటీ సాగనుందని రష్యా అధికారిక కార్యాలయం 'క్రెమ్లిన్' ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ స్పష్టం చేశారు.
శుక్రవారం నాడు దిల్లీ వేదికగా భారత్ అధ్యక్షతన 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం జరగనున్న విషయం తెలిసిందే. ఆ సమావేశానికి ముందే మోదీ - పుతిన్ ఒకరిని ఒకరు కలవబోతున్నారు. అనంతరం ఇరు దేశాల ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొననున్నట్లు రష్యా అధ్యక్ష కార్యాలయం క్రెమ్లిన్ ప్రతినిధి పెస్కోవ్ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

యుద్ధ పరిష్కారం కోసం భారత్ చూపిస్తున్న నిబద్ధతను, చొరవను రష్యా మనస్ఫూర్తిగా స్వాగతిస్తోందని ఆయన వెల్లడించారు. అసలు తాము ఎప్పుడూ యుద్ధాన్ని కోరుకోలేదని, గతంలో మొదలైన ఈ వివాదానికి శాంతియుతంగా చుక్కాని పెట్టడానికే రష్యా ప్రయత్నిస్తోందని చెప్పారు. రష్యా, ఉక్రెయిన్ , అమెరికా మధ్య మళ్లీ శాంతి చర్చలు ప్రారంభమవుతాయని తాము ఆశిస్తున్నామని, శాంతి పునరుద్ధరణ కోసం భారత్‌తో పాటు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలు కూడా ఆహ్వానించదగినవేనని కొనియాడారు.
ఆ విదేశీ కుట్రలను తిప్పికొడతాం.. ఉక్రెయిన్‌కూ ఉండాలి ఆసక్తి!
శాంతి ప్రక్రియ ముందుకు సాగాలంటే కేవలం తమ వైపు నుంచే కాకుండా ఉక్రెయిన్ నుంచి కూడా అంతే సుముఖత ఉండాలని రష్యా స్పష్టం చేసింది. కొన్ని ఐరోపా దేశాలు ఉక్రెయిన్‌ను నిరంతరం రెచ్చగొడుతూ శాంతి చర్చలను పక్కదారి పట్టించేందుకు కుట్ర పన్నుతున్నాయని పెస్కోవ్ సంచలన ఆరోపణలు చేశారు. అయితే ఆ విదేశీ కుట్రలు ఫలించకుండా తాము అడ్డుకుంటామని, శాంతి మార్గంలోనే పరిష్కారాన్ని అన్వేషిస్తామని పునరుద్ఘాటించారు.
వ్యాపారం, రవాణా ప్రాజెక్టులపై బిగ్ ప్లాన్!
కేవలం యుద్ధం మాత్రమే కాకుండా, రెండు దేశాల మధ్య ఆర్థిక బంధాన్ని మరింత బలోపేతం చేసుకోవడంపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు. రష్యా విపణిలో పెట్టుబడులు పెట్టేందుకు భారత కంపెనీలు ఆసక్తి చూపుతుండగా, అదే సమయంలో భారత్‌లో తమ వ్యాపారాన్ని విస్తరించాలని రష్యా భావిస్తోంది. దీనికితోడు అంతర్జాతీయ రవాణా కారిడార్లు, సరుకు రవాణా ప్రాజెక్టులపై ఇరు నేతలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. అలాగే పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో నెలకొన్న ఉద్రిక్తతలు గ్లోబల్ ఎకానమీపై ఎలాంటి ప్రభావం చూపుతున్నాయనే అంశం కూడా మోదీ-పుతిన్ భేటీలో చర్చకు రానుంది.














Click it and Unblock the Notifications
