నిర్దోషిని, లోక్‌సభకు వెళ్లేందుకు అనుమతించండి: సుప్రీంకోర్టుకు రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ: మోడీ ఇంటి పేరు కేసులో తాను ఎలాంటి నేరానీకి పాల్పడలేదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. తాను నిర్ధోషినని, తనకు విధించిన రెండేళ్ల శిక్షపై స్టే విధించాలని సుప్రీంకోర్టును కోరారు. ప్రస్తుతం జరుగుతున్న లోక్‌సభ సమావేశాల్లో పాల్గొనే అవకాశం కల్పించాలని సర్వోన్నత న్యాయస్థానాన్ని రాహుల్ అభ్యర్థించారు. రెండేళ్ల జైలు శిక్షపడటంతో రాహుల్ పార్లమెంటు సభ్యత్వంపై అనర్హత వేటు పడిన విషయం తెలిసిందే.
కాగా, 2019లో కర్ణాటకలో జరిగిన ఓ ఎన్నికల సభలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. దొంగలందరికీ మోడీ ఇంటి పేరే ఎందుకుంటుంది? అని వ్యాఖ్యానించారు. దీనిపై గుజరాత్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేశ్ మోడీ పరువు నష్టం దావా వేశారు. దీంతో సూరత్ కోర్టు రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష విధించింది. ఈ నేపథ్యంలో ప్రాతినిథ్య చట్టం కింద వయనాడ్ ఎంపీ పదవి కోల్పోయారు. సూరత్ కోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో సవాల్ చేసిన రాహుల్ గాంధీ తాజాగా అఫిడవిట్ దాఖలు చేశారు.

తాను ఎలాంటి నేరానికీ పాల్పడలేదని రాహుల్ తన అఫిడవిట్‌లో పేర్కొన్నారు. తానేమీ శిక్షార్హమైన నేరానికి పాల్పడలేదని తెలిపారు. ఒకవేళ క్షమాపణ చెప్పాల్సి వస్తే అదే అతి పెద్ద శిక్ష అవుతుందన్నారు. ఒకవేళ క్షమాపణే అయితే ఈ పాటికే చెప్పేవాడినని పేర్కొన్నారు. తాను క్షమాపణ చెప్పడానికి నిరాకరించినందువల్లే తాను 'అహంకారి' అని పూర్ణేశ్ మోడీ పేర్కొన్నారని తన అఫిడవిట్‌లో తెలిపారు.
ఏ తప్పూ చేయకపోయినా ప్రజాప్రాతినిథ్య చట్టం కింద క్రిమినల్ నేరాలు మోపి బలవంతంగా క్షమాపణ చెప్పించాలనుకోవడం న్యాయ వ్యవస్థ సమయాన్ని దుర్వినియోగం చేయడమే అవుతుందని రాహుల్ పేర్కొన్నారు. తనపై విధించిన శిక్షపై స్టే విధించి.. ఈ వర్షాకాల పార్లమెంటు సమావేశాల్లో పాల్గొనేందుకు అనుమతివ్వాలని రాహుల్ గాంధీ సుప్రీంకోర్టును అభ్యర్థించారు.
కాగా, తనకు విధించిన శిక్షను వాయిదా వేయడానికి నిరాకరించిన గుజరాత్ హైకోర్టు జులై 7న ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ రాహుల్ గాంధీ చేసిన అప్పీల్‌పై ఆగస్టు 4న అత్యున్నత న్యాయస్థానం విచారణ చేపట్టనుంది.












Click it and Unblock the Notifications