దేశ ప్రజలు మోడీని విశ్వసిస్తున్నారు: ఎంపి కవిత
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీని కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రజలు విశ్వసిస్తున్నారని తెలంగాణ రాష్ట్ర సమితి పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. శుక్రవారం జరిగిన లోక్‌సభలో బొగ్గు కుంభకోణంపై చర్చ సందర్భంగా ఆమె మాట్లాడారు.
దేశ ప్రజలు మోడీపై ఎంతో విశ్వాసం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. ఉత్తర భారతదేశంతోపాటు తెలంగాణ నుంచి వేలాది మంది కార్మికులు బొగ్గు గనులపై ఆధారపడి జీవిస్తున్నారని తెలిపారు. బొగ్గు గనుల కుంభకోణం దేశానికి చెడ్డపేరు తెచ్చిందని ఎంపీ కవిత అన్నారు. బొగ్గు గనుల ప్రైవేటీకరణకు కేంద్ర ప్రయత్నించడం ఆందోళన కలిగిస్తుందన్నారు.

ప్రైవేటీకరణ వల్ల వేలాది మంది కార్మికుల సంక్షేమం ప్రశ్నార్థకంగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలోని సింగరేణి బొగ్గుగనుల్లో 70 వేల మంది కార్మికులు పని చేస్తున్నారన్నారు. దేశంలో అత్యధికంగా సింగరేణి గనుల నుంచే బొగ్గు ఉత్పత్తి అవుతుందని తెలిపారు.
బొగ్గు గనులను ప్రైవేటీకరిస్తే ప్రైవేటు యాజమాన్యాలు యూనియన్లను బలహీనరుస్తాయని, కార్మికుల సంక్షేమం పట్టించుకోవని కవిత పేర్కొన్నారు. బొగ్గు గనులు ప్రైవేటీకరిస్తే వారి పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. తమ విన్నపాన్ని కేంద్రం పరిగణలోకి తీసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు. కేంద్రం బొగ్గు గనుల కేటాయింపుల్లో కోల్‌ఇండియా మాదిరిగానే సింగరేణి బొగ్గు గనులకు ప్రాధాన్యం ఇవ్వాలని కవిత కోరారు.












Click it and Unblock the Notifications