భారత్‌లో ఉండడమా లేక 370రద్దా: ఒమర్ అల్టీమేటం
శ్రీనగర్/న్యూఢిల్లీ: జమ్ము కాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించిన రాజ్యాంగంలోని 370 అధికరణను ఉపసంహరించుకునేందుకు చర్చలు ప్రారంభించామంటూ ప్రధాని కార్యాలయంలో సహాయమంత్రి జితేంద్ర సింగ్ మంగళవారం అన్నారు. జితేంద్ర సింగ్ మంగళవారం తన శాఖ బాధ్యతలు చేపట్టగానే చేసిన ఈ వ్యాఖ్యలు జమ్మూ కాశ్మీర్‌తోపాటు దేశ రాజధాని ఢిల్లీ రాజకీయాల్లోనూ ప్రకంపనలు సృష్టించింది.
జితేంద్ర సింగ్ వ్యాఖ్యలపై జమ్మూ, కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తీవ్రంగా స్పందించారు. 370 అధికరణ లేకపోతే కాశ్మీర్ భారత్‌లో అంతర్భాగంగా ఉండదని... ఈ రెండింటిలో ఏదికావాలో కొత్త ప్రభుత్వం తేల్చుకోవాలన్నారు. 370 అధికరణను ఎత్తివేయడానికి చర్చలు ప్రారంభమైనాయని పిఎంఓ కార్యాలయంలో మంత్రి అంటున్నారని, ఎంత గొప్ప ప్రారంభమంటూ తన ట్విట్టర్‌లో మోడీ సర్కారుకి చురకలు అంటించారు.

జమ్మూ కాశ్మీర్‌కు, భారత దేశంలోని మిగతా ప్రాంతాలకు మధ్య ఉన్న ఏకైక వారధి ఆర్టికల్ 370 మాత్రమేనని ఆయన అన్నారు. దీన్ని రద్దు చేస్తామంటూ ప్రకటించడం పూర్తి బాధ్యతారాహిత్యమన్నారు.
కాగా, జమ్ము కాశ్మీర్‌కు అమలు చేస్తున్న ఆర్టికల్ 370ను తొలగించేందుకు తమ ప్రభుత్వం ఇప్పటికే చర్చలు ప్రారంభించిందని, ఈ ఆర్టికల్ మూలంగా అక్కడి యువతకు తీరని నష్టం వాటిల్లుతోందని జితేంద్ర సింగ్ చెప్పారు. ఆర్టికల్ 370 ఒక మానసిక అడ్డంకిగా తయారైందన్నారు. మోడీ ప్రభుత్వం ఆర్టికల్ 370పై త్వరలోనే మంతనాలు ప్రారంభిస్తుందన్నారు. జమ్ము కాశ్మీర్‌కు ఆర్టికల్ 370 ద్వారా కల్పించిన ప్రత్యేక హోదా మూలంగా ఆ రాష్ట్రానికి నష్టం కలుగుతోందన్నారు. జితేంద్ర చేసిన ఈ వ్యాఖ్యలను జమ్ము కాశ్మీర్ రాజకీయ పార్టీలు ఖండించాయి.












Click it and Unblock the Notifications