ప్రీతిజింటా వేధింపు ఫిర్యాదు: మాజీ ప్రియుడి దిగ్భ్రాంతి
ముంబై: తన పైన ప్రీతీ జింతా చేసిన ఆరోపణ పైన నెస్ వాడియా స్పందించాడు. ప్రీతి జింతా ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదన్నాడు. ఆమె చెప్పేదంతా అబద్ధమని, తాను ఏనాడూ ఆమెను భయపెట్టడం గానీ, అసభ్యంగా ప్రవర్తించడంగానీ చేయలేదని చెప్పాడు. ఆమె పోలీసు కేసు పెట్టిందన్న వార్త తనను దిగ్భ్రాంతికి గురి చేసిందన్నాడు.
కాగా, ఐపిఎల్ ఫ్రాంచైజీ కింగ్స్ ఎలెవెన్ పంజాబ్‌లో సహ భాగస్వామి, మాజీ ప్రియుడు నెస్ వాడియా తనను వేధించాడని, చేయికూడా చేసుకున్నాడని బాలీవుడ్ నటి ప్రీతీ జింతా పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. సుమారు ఐదేళ్ల నుంచి వీరి మధ్య ప్రేమాయణం సాగుతున్నట్టు కథనాలు ప్రచారంలో ఉన్నాయి.

రెండేళ్ల క్రితం విభేదాలు తలెత్తినప్పటికీ, ఇద్దరూ కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ ఫ్రాంచైజీ భాగస్వాములుగా కొనసాగుతున్నారు. ఇలావుంటే, ఏడో ఐపిఎల్‌లో భాగంగా గత నెల 30న కింగ్స్ ఎలెవెన్ పంజాబ్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య వాంఖడే స్టేడియంలో జరిగిన మ్యాచ్‌ని తిలకిస్తున్నప్పుడు నెస్ వాడియా (44) తనతో అసభ్యంగా ప్రవర్తించాడని 39 ఏళ్ల ప్రీతి తన ఫిర్యాదులో ఆరోపించింది.
తనను తీవ్రంగా బెదిరించాడని పేర్కొంది. తనను అవమానించడమే కాకుండా.. నువ్వొక సినీ నటివి మాత్రమేనని, తాను కావాలనుకుంటే నిన్ను కనిపించకుండా చేయగలనని హెచ్చరించాడన్నారు. ఇది జరుగుతున్నప్పుడు తనకు మద్దతుగా ఎవరు రాలేదని ఆమె వాపోయారు.
ఆమె ఫిర్యాదు ఆధారంగా నెస్ వాడియాపై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. 354, 504, 506, 509 సెక్షన్ల ప్రకారం అతనిపై కేసు పెట్టారు. కాగా, ప్రీతీ జింటా పెట్టిన కేసుపై జాతీయ మహిళా కమిషన్ స్పందించింది. నెస్ వాడియాను వెంటనే అరెస్టు చేయాలని పోలీసులను ఆదేశించింది. కేసును ముంబై పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications