జస్టిస్ రాకేష్ కుమార్ రాజీనామా: అమరావతి రైతులు శాలువా కప్పి వీడ్కోలు పలికింది ఆయనకే
న్యూఢిల్లీ: నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ (NCLAT) జ్యుడీషియరీ సభ్యుడు జస్టిస్ రాకేష్ కుమార్.. తన పదవికి రాజీనామా చేశారు. దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశాల నుంచి ధిక్కాక చర్యలను ఎదుర్కొంటోన్న నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. తన రాజీనామా పత్రాన్ని లా అప్పిలేట్ ట్రిబ్యునల్‌కు పంపించారు.
జస్టిస్ రాకేష్ కుమార్ తన పదవికి రాజీనామా చేసినట్లు ఆయన తరఫు న్యాయవాది, సీనియర్ అడ్వొకేట్ పీఎస్ పట్వాలియా వెల్లడించారు. ఈ విషయాన్ని సుప్రీంకోర్టుకు తెలియజేశారు. సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లంఘించే ఉద్దేశం లేదని, కోర్టు ధిక్కరణ వ్యవహారంలో తన పరువుకు భంగం వాటిల్లకూడదనే ఉద్దేశంతోనే రాజీనామా చేసినట్లు వివరించారు.

కోర్టు ధిక్కారణను ఎదుర్కొంటోన్న తరువాత లా అప్పిలేట్ ట్రిబ్యునల్ జ్యుడీషియల్ సభ్యుడిగా ఇక తాను పదవిలో కొనసాగలేనని జస్టిస్ రాకేష్ కుమార్ వ్యాఖ్యానించారు. తనపై వచ్చిన అభియోగాలపై పూర్తిస్థాయిలో విచారణ జరిపించాలని, తాను రాజీనామా చేసినందున ఈ కేసును త్వరగా మూసివేయాలని సుప్రీంకోర్టుకు అభ్యర్థించారు.
జస్టిస్ రాకేష్ కుమార్ గతంలో సంచలనం సృష్టించిన దాణా కుంభకోణంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా చిత్తశుద్ధితో పని చేశారని ఆయన తరఫు న్యాయవాది పట్వాలియా గుర్తు చేశారు. ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాతో కూడిన ధర్మాసనానికి దీనికి సంబంధించిన వివరాలను అందజేశారు.
ఫినోలెక్స్ కేబుల్స్ వార్షిక సర్వ సభ్య సమావేశానికి సంబంధించిన కేసులో జస్టిస్ రాకేష్ కుమార్ కోర్టు ధిక్కారణను ఎదుర్కొన్నారు. ప్రకాష్ ఛాబ్రియా, దీపక్ ఛాబ్రియా మధ్య వివాదంపై తాము తీర్పు వెలువడించేంత వరకు ఏజీఎం ఫలితాలపై యథాతథ స్థితిని కొనసాగించాలంటూ గతంలో నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ గతంలో ఉత్తర్వులను జారీ చేసింది.
ఈ యథాతథ స్థితిని సెప్టెంబరు 20వ తేదీన సుప్రీంకోర్టు రద్దు చేసింది. దీన్ని లా అప్పిలేట్ ట్రిబ్యునల్ సభ్యుడి హోదాలో జస్టిస్ రాకేష్ కుమార్, డాక్టర్ అలోక్ శ్రీవాస్తవలతో కూడిన బెంచ్ పట్టించుకోలేదనేది ప్రధాన ఆరోపణ. ఈ విషయం తన దృష్టికి రావడంతో సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. దీనిపై విచారణ జరిపించాలంటూ ట్రిబ్యునల్ ఛైర్మన్ జస్టిస్ అశోక్ భూషణ్‌ను ఆదేశించింది.
కాగా- జస్టిస్ రాకేష్ కుమార్ గతంలో ఏపీ హైకోర్టులో న్యాయమూర్తిగా పని చేశారు. ఆయన పదవీ విరమణ చేసినప్పుడు అమరావతి ప్రాంత రైతులు ఘనంగా వీడ్కోలు పలికారు. కారులో వెళ్తోండగా.. ఎదురెళ్లి ఆయనకు శాలువా కప్పి సన్మానించారు అప్పట్లో. రాజధాని సహా వివిధ అంశాలపై ఆయన ఇచ్చిన తీర్పులపై అమరావతి ప్రాంత రైతులు స్వాగతించారు.












Click it and Unblock the Notifications