దేశాన్ని కుదిపేసిన నీట్ పేపర్ లీక్ ఉద్యమంపై మూవీ.. టైటిల్ ఇదే..?
నీట్ యూజీ 2026 ప్రశ్నాపత్రం లీక్ వ్యవహారంపై దేశవ్యాప్తంగా ఉద్యమం ఉవ్వెత్తున జరిగింది. దేశ రాజధాని దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నెల రోజులకు పైగా జరిపిన ఆందోళనలు చరిత్రాత్మకంగా నిలిచాయి. ఈ ఉద్యమం అంతర్జాతీయంగానూ ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. నీట్ పేపర్ లీక్ కు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థుల ఉద్యమం ఉద్ధృతంగా సాగింది.
ఈ ఉద్యమంలో భాగంగా ప్రముఖ పర్యావరణవేత్త సోనమ్ వాంగ్ చుక్ ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు. మరోవైపు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో విద్యార్థులు చలో సంసద్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. విద్యార్థులపై పోలీసులు లాఠీ ఛార్జ్, టియర్ గ్యాస్ ప్రయోగించడంపై యావత్ భారతావని కేంద్ర ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎట్టకేలకు విద్యార్థుల ఉద్యమానికి తలొగ్గిన కేంద్ర ప్రభుత్వం విద్యాశాఖ మంత్రిగా ధర్మేంద్ర ప్రధాన్ ను తొలగించి ఆయన స్థానంలో ప్రహ్లాద్ జోషీను నియమించింది.
అయితే కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ఈ విద్యార్థి ఉద్యమం ఇప్పుడు సినిమాగా తెరకెక్కనుంది. ఈ మేరకు బాలీవుడ్ లో సినిమా టైటిల్ ఖరారు కావడంతో పాటు రిజిస్టర్ కూడా అయింది. ఈ సినిమాకు 'ది యాక్సిడెంటల్ కాక్రోచ్ పార్టీ' అనే టైటిల్‌ను అధికారికంగా రిజిస్టర్ చేసినట్లు సమాచారం. ఈ ప్రాజెక్ట్ ను జైపూర్ కు చెందిన గోవింద్ దేవ్ అధికారికంగా ప్రకటించారు.

ఈ మూవీలో ఉద్యమానికి సంబంధించి ఇప్పటివరకూ బయటకు రాని ఆసక్తికర, దిగ్భ్రాంతికర నిజాలను చూపించనున్నారు. ఈ మూవీ దాదాపు రూ. 20 కోట్లతో తెరకెక్కనున్నట్లు సమాచారం. ఈ చిత్రాన్ని 2027లో థియేటర్లలోకి తీసుకురావడానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను వెల్లడించనున్నారు.













Click it and Unblock the Notifications