NFHS-6: ప్రమాదంలో తెలుగు రాష్ట్రాల ఆరోగ్య స్థితి? సర్వే చెప్పిన భయంకర నిజాలు 

దేశవ్యాప్తంగా ప్రజల జీవన ప్రమాణాలు, ఆరోగ్యం, పోషకాహార స్థితిగతులను ప్రతిబింబించే జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-6 (NFHS-6, 2023-24) నివేదికను కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ (MoHFW) విడుదల చేసింది. ముంబైలోని ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ పాపులేషన్ సైన్సెస్ (IIPS) నోడల్ ఏజెన్సీగా దేశంలోని 715 జిల్లాల్లో నిర్వహించిన ఈ భారీ సర్వే.. ఒకవైపు దేశం సాధించిన వేగవంతమైన పురోగతిని చాటుతూనే, మరోవైపు రెండు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు సంబంధించిన ఆసక్తికరమైన, ఆందోళనకరమైన వాస్తవాలను కళ్లముందు ఉంచింది.

పదేళ్ల క్రితంతో పోలిస్తే తెలుగు తల్లుల జీవనశైలి మారింది. వారి చేతుల్లో స్మార్ట్‌ఫోన్లు వచ్చాయి, సొంతంగా బ్యాంకు ఖాతాలు తెరుచుకున్నాయి, ఆసుపత్రి కాన్పులు పెరిగాయి. కానీ, ఇదే తరుణంలో 'సిజేరియన్’లు(C- Section), అంటువ్యాధులు, పోషకాహార లోపం, పెరుగుతున్న జీవనశైలి వ్యాధులు రెండు రాష్ట్రాలనూ వెంటాడుతున్నాయి.

NFHS-6 Analysis Andhra Pradesh And Telangana Record Gains In Women Empowerment And Child Vaccination

ఆంధ్రప్రదేశ్: డిజిటల్ సాధికారత పెరిగింది.. కానీ బాల్య వివాహాలు మారాలి

ఆంధ్రప్రదేశ్‌లో మౌలిక సదుపాయాలు, ఆరోగ్య సంరక్షణ సేవలు గతంతో పోలిస్తే గణనీయంగా మెరుగయ్యాయి. రాష్ట్రంలో 99.7% కుటుంబాలకు విద్యుత్, 97.6% కుటుంబాలకు మెరుగైన తాగునీరు అందుతోంది. ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ ఆరోగ్య పథకాల కారణంగా గతంలో 80.2% గా ఉన్న ఆరోగ్య బీమా పరిధి ఇప్పుడు ఏకంగా 91.9%కి విస్తరించింది. అయోడిన్ ఉప్పు వాడకం సైతం 83.1% నుంచి 97.3%కి చేరి విప్లవాత్మక మార్పును తెచ్చింది.

మహిళల విద్యాస్థాయి, డిజిటల్ వినియోగంలో ఏపీ అనూహ్య వృద్ధిని నమోదు చేసింది. పదేళ్లకు పైగా బడికి వెళ్లిన మహిళల సంఖ్య 39.6% నుంచి 48.4%కి పెరగ్గా, ఇంటర్నెట్ వాడుతున్న మహిళల శాతం 21% నుంచి ఏకంగా మూడు రెట్లు పెరిగి 63.6%కి చేరింది. తల్లీబిడ్డల ఆరోగ్య విషయానికి వస్తే, గర్భం దాల్చిన మొదటి మూడు నెలల్లోనే ప్రసవపూర్వ తనిఖీ (ANC) చేయించుకుంటున్న తల్లులు 81.7% నుంచి 88.6%కి, కనీసం నాలుగు సార్లు తనిఖీలకు వెళ్లేవారు 67.5% నుంచి 85.5%కి పెరిగారు. ఫలితంగా 98.4% కాన్పులు సురక్షితంగా ఆసుపత్రుల్లోనే జరుగుతున్నాయి. చిన్నపిల్లల పూర్తి టీకాకరణ సైతం 73.2% నుంచి 87.7%కి దూసుకెళ్లింది.

LPG: కేంద్రం అత్యవసర ఆదేశాలు! నెలకు సరిపడా దాచండి!
LPG: కేంద్రం అత్యవసర ఆదేశాలు! నెలకు సరిపడా దాచండి!

అయితే, మహిళల సామాజిక భద్రత విషయంలో ఏపీ ఇంకా ప్రయాణించాల్సిన దూరం చాలా ఉంది. రాష్ట్రంలో ఇప్పటికీ 25.1% బాల్య వివాహాలు (18 ఏళ్ల లోపు పెళ్లిళ్లు) జరుగుతున్నాయి. అంటే ప్రతి నలుగురిలో ఒకరికి చిన్న వయసులోనే పెళ్లి అయిపోతోంది. గృహహింస విషయానికి వస్తే 22.7% మంది మహిళలు భర్త చేతిలో వేధింపులు ఎదుర్కొంటున్నారు (గతంలో ఇది 29.9% ఉండేది).

తెలంగాణ: ఆర్థిక నిర్ణయాల్లో ముందడుగు.. కానీ మద్యం, గృహహింస ముప్పు

తెలంగాణ రాష్ట్రం కూడా తల్లీబిడ్డల ఆరోగ్య రక్షణలో బలమైన సూచికలను నమోదు చేసింది. రాష్ట్రంలో 98.8% ప్రసవాలు ఆసుపత్రుల్లోనే సురక్షితంగా సాగుతున్నాయి. గర్భిణులు మొదటి త్రైమాసికంలోనే తనిఖీలు చేయించుకునే శాతం 88.5% నుంచి 89.6%కి పెరిగింది. నాలుగు సార్లు వైద్యులను సంప్రదించే తల్లులు 70.4% నుంచి 80.3%కి చేరారు. గర్భధారణ సమయంలో కనీసం 100 రోజుల పాటు ఐరన్ ఫోలిక్ యాసిడ్ (IFA) మాత్రలు మింగిన తల్లుల సంఖ్య 57.9% నుంచి 81%కి పెరగడం విశేషం. చిన్నపిల్లల్లో విటమిన్-A పంపిణీ సైతం 72.4% నుంచి 90.5%కి పెరిగింది.

మహిళా సాధికారత, కుటుంబ నిర్ణయాల్లో తెలంగాణ మహిళలు ఆంధ్రప్రదేశ్ కంటే మెరుగైన స్థానంలో ఉన్నారు. దాదాపు 89.9% మంది వివాహిత మహిళలు కుటుంబంలో కీలక నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛను కలిగి ఉన్నారు. సొంతంగా నగదు వేతనం సంపాదిస్తున్న మహిళలు 53.2% మంది ఉన్నారు. బాల్య వివాహాల నియంత్రణలో తెలంగాణ మంచి పురోగతి సాధించింది; గతంలో 23.5% ఉన్న బాల్య వివాహాలు ఇప్పుడు 17.9%కి తగ్గాయి.

సంక్షేమ పథకాలకు 'ఈ-రూపాయి', సబ్సిడీలపై ఆర్‌బీఐ సంచలన ఆర్డర్!
సంక్షేమ పథకాలకు 'ఈ-రూపాయి', సబ్సిడీలపై ఆర్‌బీఐ సంచలన ఆర్డర్!

కానీ, తెలంగాణ సామాజిక జీవనాన్ని కలవరపెడుతున్న అతిపెద్ద సమస్య 'మద్యపానం’. రాష్ట్రంలో 43.9% మంది పురుషులు మద్యానికి బానిసలయ్యారు. పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో ఈ శాతం 23.3% మాత్రమే ఉండగా, తెలంగాణలో ఇది దాదాపు రెట్టింపు కావడం గమనార్హం. ఈ మితిమీరిన మద్యపానమే కుటుంబాల ఆర్థిక స్థితిని దెబ్బతీస్తూ, గృహహింసకు దారితీస్తోంది. రాష్ట్రంలో ప్రతి ముగ్గురు మహిళల్లో ఒకరు (30.8%) భర్త నుంచి శారీరక లేదా మానసిక హింసను అనుభవిస్తున్నట్లు సర్వే తేల్చింది. పురుషుల్లో పొగాకు వాడకం 21.1% గా నమోదైంది.

రెండు రాష్ట్రాల ఉమ్మడి శాపం: 'సిజేరియన్'ల అంటువ్యాధి

ఈ సర్వేలో రెండు తెలుగు రాష్ట్రాలను తీవ్రంగా వేలెత్తి చూపుతున్న అంశం.. ప్రసవాల్లో శస్త్రచికిత్సల (సిజేరియన్ల) జోరు. ప్రపంచ ఆరోగ్య సంరక్షణ నిబంధనల (WHO) ప్రకారం.. ఏదైనా ఒక ప్రాంతంలో గరిష్ఠంగా 10% నుంచి 15% కాన్పులు మాత్రమే సిజేరియన్లు అవసరమవుతాయి. కానీ తెలుగు రాష్ట్రాల్లో ఇది వ్యాపారంగా, ఒక అంటువ్యాధిలా మారిపోయింది.

  • ఆంధ్రప్రదేశ్‌లో: గతంలో 42.4% ఉన్న సిజేరియన్ల రేటు ఇప్పుడు 52.2%కి చేరింది. అంటే సగానికి పైగా ఆపరేషన్లే. ప్రైవేట్ ఆసుపత్రులలోనైతే ఇది 66.2%గా ఉంది.
  • తెలంగాణలో: పరిస్థితి మరింత భయానకంగా ఉంది. రాష్ట్రంలో మొత్తం సిజేరియన్ల రేటు 62.2% కాగా, ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లే ప్రతి వంద మంది తల్లులలో దాదాపు 84 మందికి (83.9%) పొట్ట కోసి బిడ్డను బయటకు తీస్తున్నారు.

ఇది వైద్య అవసరమా లేక ఆసుపత్రుల కాసుల కక్కూర్తా అనే చర్చ సమాజంలో బలంగా నడుస్తోంది. నార్మల్ డెలివరీల సంఖ్యను పెంచేందుకు ప్రభుత్వాలు గట్టి చర్యలు తీసుకోకపోతే తల్లుల ఆరోగ్యం దీర్ఘకాలికంగా ప్రమాదంలో పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఆరోగ్య వైరుధ్యాలు: ఒకవైపు స్థూలకాయం.. మరోవైపు పోషకాహార లోపం

రెండు రాష్ట్రాల్లోనూ ఆధునిక జీవనశైలి తెచ్చిన ముప్పు స్పష్టంగా కనిపిస్తోంది. పట్టణ ప్రాంతాల్లో శారీరక శ్రమ తగ్గి స్థూలకాయం (Obesity) పెరుగుతుంటే, గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ పౌష్టికాహార లోపం తాండవిస్తోంది.

ఆరోగ్య సూచికలు (పోలిక) ఆంధ్రప్రదేశ్ తెలంగాణ
పిల్లల్లో స్టంటింగ్ (వయస్సుకు తగ్గ ఎత్తు లేకపోవడం) 24.6% 27.0%
పిల్లల్లో అండర్ వెయిట్ (తక్కువ బరువు) 23.2% 27.8%
మహిళల్లో అధిక రక్త చక్కెర (మధుమేహం) 21.8% 19.6%
పురుషుల్లో అధిక రక్త చక్కెర (మధుమేహం) 24.1% 24.5%
మహిళల్లో రక్తపోటు (హైపర్‌టెన్షన్) 24.1% 19.6%

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో ఇప్పటికీ ప్రతి నలుగురు పిల్లల్లో ఒకరు పోషకాహార లోపంతో పుడుతున్నారు. మరోవైపు పెద్దవారిలో మధుమేహం, రక్తపోటు (బిపి) సైలెంట్ కిల్లర్స్‌లా మారుతున్నాయి. తెలంగాణలో గ్రామీణ మహిళల్లో 19.5% మంది ఇప్పటికీ సరైన బాడీ మాస్ ఇండెక్స్ (తక్కువ BMI) లేక నీరసించిపోతున్నారు.

అద్దంలో కనిపించే మచ్చలను తుడవాలి!

జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-6 ఫలితాలు తెలుగు రాష్ట్రాల ప్రగతికి నిదర్శనంగా నిలుస్తూనే, సరిదిద్దుకోవాల్సిన లోపాలను ఎత్తిచూపాయి. డిజిటల్ విప్లవం, బ్యాంకింగ్ సేవలు పల్లె తల్లులను ఆర్థికంగా నిలబెడుతున్నాయి. ప్రభుత్వాల పోషణ్ అభియాన్, ఆయుష్మాన్ భారత్, జాతీయ ఆరోగ్య మిషన్ (NHM) వంటి కార్యక్రమాలు క్షేత్రస్థాయిలో మార్పు తెస్తున్నాయి. అయితే, పెరిగిన ఆదాయం ఆరోగ్యకరమైన జీవనశైలిగా మారడం లేదు. ఆసుపత్రి కాన్పులు పెరిగినా, అవి సిజేరియన్లుగా మారి తల్లులను శారీరకంగా బలహీనపరుస్తున్నాయి. మద్యం, గృహహింస, పోషకాహార లోపం వంటి మచ్చలను తుడిచివేసినప్పుడే.. ఈ సర్వే అందించిన అంకెలకు నిజమైన సార్థకత లభిస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+