బెంగళూరు బాంబు పేలుడు కేసులో ట్విస్ట్, ఆంధ్రా బార్డర్ లో ఎన్ఐఏ సోదాలు, ఎక్కడి నుంచి ఎక్కడికి ?
బెంగళూరులోని రామేశ్వరం కేఫ్ బాంబు పేలుడు కేసుకు సంబంధించి అనుమానిత బాంబర్ ను పట్టుకోవడానికి, అతని ఆచూకి తెలుసుకోవడానికి బెంగళూరు పోలీసులు కర్ణాటకలోని తుమకూరులోని వివిద ప్రాంతాల్లో గాలించారు. నిందితుడు తుమకూరులో ఉన్నట్లు అనుమానం రావడంతో బెంగళూరు పోలీసులను అతన్ని వెతుక్కుంటూ అక్కడికి వెళ్లారు. అనుమానిత బాంబర్ మార్చి 1వ తేదీన తుమకూరిలో సంచరించినట్లు బెంగళూరు పోలీసులకు సమాచారం అందింది.
బెంగళూరులోని రామేశ్వరం కేఫ్ లో బాంబు పెట్టిన నిందితుడు తుమకూరులో తిరిగాడని బెంగళూరు పోలీసులకు సమాచారం అందింది. బుధవారం రాత్రి ఇద్దరు డీసీపీల ఆధ్వర్యంలో 28 వాహనాలలో తుమకూరు చేరుకున్న పోలీసులు తుమకూరులోని పలు ప్రాంతాల్లో అతని గుర్తింపు కోసం గాలించారు. తుమకూరులోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసి సీసీటీవీల్లోని క్లిప్పింగ్స్ ను బెంగళూరు పోలీసులు పరిశీలించి వాటిని స్వాధీనం చేసుకున్నారని తెలిసింది.

బళ్లారిలోని మండిపేట సహా అనేక ప్రాంతాల్లో రామేశ్వరం కేఫ్ బాంబు పేలుడు కేసు నిందితుడి ఆనవాళ్ల కోసం ఎన్ఐఏ అధికారులు సోదాలు చేశారు. తుమకూరు నుంచి నిందితుడు బస్ లో బళ్లారి వచ్చాడని ఎన్ఐఏ అధికారులకు సమాచారం అందింది. బళ్లారి నగరంలోని బస్ స్టాండ్ లతో పాటు పలు ప్రాంతాల్లోని సీసీటీవీ కెమెరాల దృశ్యాలను ఎన్‌ఐఎ అధికారుల బృందం పరిశీలించింది,

ఎన్ఐఏ అధికారుల వెంట తుమకూరు, బళ్లారి సిటీ పోలీసులు ఉన్నారు. నిందితుడు తుమకూరు నుంచి బళ్లారి చేరుకున్నాడని ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బళ్లారి బస్ స్టాండ్లలో ఎన్‌ఐఏ బృందం సమాచారం సేకరించింది. ఎన్‌ఐఏ బృందం దర్యాప్తుకు స్థానిక పోలీసులు సహకరించారు. నిందితుడు బళ్లారి బస్ స్టేషన్‌కు చేరుకున్నాడని, తరువాత బళ్లారి నుంచి మంత్రాలయం- గోకర్ణ వైపు వెలుతున్న బస్సులో భత్కల్ కు వెళ్ళాడని ఎన్ఐఏ అధికారులకు సమాచారం అందింది.
అందుకే బళ్లారిలోని బస్ స్టాండ్ చేరుకున్న ఎన్ఐఏ అధికారులు అక్కడ కీలక సమాచారం సేకరించడానికి ప్రయత్నించారని తెలిసింది. ఇదే సమయంలో కొందరు అధికారులు ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం, మంత్రాలయంకు వెళ్లి వివరాలు సేకరించారని తెలిసింది. బెంగళూరులోని రామేశ్వరం కేఫ్ బాంబు పేలుడు కేసులో నిందితులను అరెస్టు చెయ్యడానికి ఎన్ఐఏ అధికారులు, కర్ణాటక పోలీసులు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications