రామేశ్వరం కేఫ్ కేసులో అనుమానిత ఉగ్రవాది అరెస్టు, ఐసిస్ తో లింక్, బళ్లారిలో ఏం జరిగిందంటే ?
ఐటీ హబ్ బెంగళూరులోని రామేశ్వరం కేఫ్ పేలుళ్ల కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) బెంగళూరు జైల్లో ఉన్న అనుమానిత ఉగ్రవాదిని విచారణ నిమిత్తం అదుపులోకి తీసుకుంది. మార్చి 1వ తేదీన ప్రముఖ రెస్టారెంట్ రామేశ్వరం కేఫ్‌లో పేలుడు సంభవించింది. డిసెంబర్ 18వ తేదీ 2023న అరెస్టు అయిన బళ్లారికి చెందిన బట్టల వ్యాపారి మిన్హాజ్ అలియాస్ మహ్మద్ సులైమాన్ (26)ను అరెస్టు చేశారు
ఇప్పుడు ప్రత్యేక కోర్టు నుండి బాడీ వారెంట్ పొందిన తర్వాత ఎన్ఐఏ అధికారులు మహ్మద్ సులైమాన్ ను కస్టడీలోకి తీసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి నిందితుడిని విచారిస్తున్నారు. బెంగళూరులోని రామేశ్వరం కేఫ్ పేలుడు ఘటనపై విచారణ జరుపుతున్న దర్యాప్తు అధికారులు పలు సమాచారం సేకరించారని కర్ణాటక హోం శాఖా మంత్రి డాక్టర్ జీ. పరమేశ్వర్ వివరించారు.

బెంగళూరులోని రామేశ్వరం కేఫ్ లో బాంబు పేలుడు జరిపిన తరువాత నిందితుడు కర్ణాటకలోని తుమకూరు వైపు బస్సులో ప్రయాణించి ఆ తర్వాత దుస్తులు మార్చుకున్నట్లు ఆధారాలు లభించాయని కర్ణాటక హోం మంత్రి జీ. పరమేశ్వర్ తెలిపారు. అదే రోజు మహ్మద్ సులైమాన్‌ను ఎన్‌ఐఏ అరెస్టు చేసింది. నిందితుడు తుమకూరు నుంచి బళ్లారికి బస్సులో వెళ్లినట్లు అనుమానిస్తున్నారు. ఉత్తర కర్ణాటకలోని బళ్లారి కేంద్రంగా పనిచేస్తున్న ఐఎస్‌ఐఎస్ విభాగానికి మహ్మద్ సులైమాన్ లీడర్ అని ఎన్‌ఐఏ అనుమానిస్తోంది.
ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైస్ (ఐఈడీ) పేలుళ్లకు కుట్ర పన్నినందుకు డిసెంబరులో ఎన్‌ఐఏ దాడి చేసిన తర్వాత మహ్మద్ సులైమాన్ ను అరెస్టు చేశారు. 2023 డిసెంబర్ 14వ తేదీ ఎన్ఐఏ అధికారులు మహ్మద్ సులైమాన్ మీద ఐఎస్ఐఎస్ లో చేరడానికి చాలా మందిని ప్రేరేపిస్తున్నాడని ఆరోపిస్తూ కేసు నమోదు చేసింది. తుమకూరులో కర్ణాటక హోం మంత్రి పరమేశ్వర్ విలేకరులతో మాట్లాడుతూ అనుమానితుడు బస్సులో తుమకూరు వెళ్లినట్లు పక్కా సమాచారం అందిందని తెలిపారు.

కేసు దర్యాప్తు అధికారులు వీడియో ఫుటేజీని పరిశీలించారని, కొన్ని ఆధారాలు దొరికాయని, తుమకూరు నుంచి బళ్లారి వెళ్లే మార్గాన్ని పరిశీలిస్తున్నట్లు సమాచారం ఉంది. విలేకరులతో మాట్లాడిన హోం మంత్రి పరమేశ్వర్ అనుమానితుడు దుస్తులు మార్చుకుని బస్సులో ప్రయాణించినట్లు విశ్వసనీయ సమాచారం అందిందని, కేసుకు సంబంధించిన అన్ని వివరాలు ఇప్పుడే వెల్లడించలేమని, నిందితులను త్వరలోనే పట్టుకుంటామని అన్నారు. దీని తరువాత కేసు దర్యాప్తులో భాగంగా జైలులో ఉన్న మహ్మద్ సులైమాన్‌ను ఎన్ఐఏ సంస్థ కస్టడీలోకి తీసుకుంది.
బెంగళూరు రామేశ్వరం కేఫ్ పేలుడుతో దేశం మొత్తం బెంగళూరు వైపు చూసింది. మార్చి 1వ తేదీన బెంగళూరులోని బ్రూక్‌ఫీల్డ్ ప్రాంతంలోని కుందనహళ్లిలోని ప్రముఖ రెస్టారెంట్ రామేశ్వరం కేఫ్‌లో ఐఈడీ పేలుడు సంభవించి 10 మంది గాయపడినట్లు పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తు చేసిన అధికారులు 9v బ్యాటరీ, ఒక టైమర్, పేలుడు జరిగిన ప్రదేశం చుట్టూ కొన్ని నట్‌లు, బోల్ట్‌లను గుర్తించి వాటిని స్వాధీనం చేసుకున్నారు.












Click it and Unblock the Notifications