ఢిల్లీ ఘాతుకం: నడుస్తున్న కారులో నైజీరియా మహిళపై గ్యాంగ్ రేప్
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో మరో సామూహిక అత్యాచారం చోటు చేసుకుంది. 35 ఏళ్ల నైజీరియా మహిళపై నలుగురు యువకులు నడుస్తున్న కారులో గ్యాంగ్‌రేప్‌నకు పాల్పడ్డారు. శుక్రవారం తెల్లవారుజామున 2.45 గంటలకు తూర్పు ఢిల్లీలోని మయూర్ విహార్ సమీపంలో డిఎన్‌డి టోల్ ప్లాజా వద్ద అపస్మారక స్థితిలో పడివున్న మహిళను చూసి సిబ్బంది సమాచారం ఇచ్చారు.
దాంతో పోలీసులు ఆమెను వైద్య పరీక్షలకోసం ఎల్‌విఎస్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. సిసి టీవీ కెమెరాల ఫుటేజ్ పరిశీలించి హ్యుండాయ్ యాక్సెంట్ కారును నడుపుతూ వచ్చిన నలుగురు వ్యక్తులు ఆమెను అక్కడ వదిలేసి వెళ్లినట్లు గుర్తించారు.

దక్షిణ ఢిల్లీలోని ఓ మాల్ వద్ద నలుగురు వ్యక్తులు ఆ మహిళను కారులో ఎక్కించుకుని అరగంటకు పైగా తిప్పిన అనంతరం డిఎన్‌డిఏ టోల్‌ప్లాజా వద్దకు చేరుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు. నలుగురు వ్యక్తులు 22-25 ఏళ్ల మధ్య యువకులేనన్నారు. నలుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. నైజీరియా మహిళ టూరిస్టు వీసాపై భారత్ వచ్చింది.
నిందితులు వాడిన కారును పోలీసులు మయూర్ విహార్ నుంచి స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీలో మహిళలపై అత్యాచారాలు ఆగడం లేదు. 2012 డిసెంబర్‌లో ఓ వైద్య విద్యార్థినిపై అత్యంత దారుణంగా బస్సులో సామూహిక అత్యాచారం కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. నిరుడు, ఉబేర్ కారు డ్రైవర్ ఓ మహిళా ఎగ్జిక్యూటివ్‌పై అత్యాచారం చేసిన సంఘటన కూడా సంచలనం సృష్టించింది.












Click it and Unblock the Notifications