Nirmala Sitharaman స్ట్రాంగ్ వార్నింగ్! వారి బాధలు అర్థం చేసుకోండి..
సొంత పని కోసం లేదా పన్ను సమస్యల పరిష్కారం కోసం వచ్చే సామాన్య ప్రజలను ఆఫీసుల చుట్టూ తిప్పించుకోవద్దని, వారి పనులను వేగంగా పూర్తి చేయాలని ఆదాయపు పన్ను (ఐటీ) శాఖ అధికారులకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. నిబంధనలను పక్కనబెట్టాల్సిన అవసరం లేదని, అయితే పౌరులకు చట్టబద్ధంగా అందాల్సిన సేవలను అనవసరమైన ఆలస్యం లేకుండా అందించడం అధికారుల బాధ్యత అని ఆమె తేల్చి చెప్పారు.
ముంబైలోని నారీమన్ పాయింట్ వద్ద నూతనంగా నిర్మించిన 13 అంతస్తుల 'ఆదాయకర్ సింధు' ఐటీ భవనాన్ని ప్రారంభించిన సందర్భంగా మంత్రి మాట్లాడారు. స్వయంగా ప్రభుత్వ శాఖ అయిన ఐటీ విభాగమే ఈ భవన నిర్మాణానికి సంబంధించిన అనుమతులు పొందడానికి ఎన్నో ఏళ్లు నిరీక్షించాల్సి వచ్చిందని గుర్తుచేశారు. ఒక ప్రభుత్వ విభాగానికే ఇన్ని తిప్పలు ఉంటే, సాయం కోసం వచ్చే సామాన్య పౌరుడి పరిస్థితి ఏంటో అధికారులు ఆలోచించాలని, అధికారుల పరిధిలో ఉన్న పనుల కోసం ప్రజలను ఆఫీసుల చుట్టూ తిప్పుకోకుండా వెంటనే పూర్తి చేయాలని హితవు పలికారు.

ల్యాండ్ ఎన్‌క్రోచ్‌మెంట్స్‌పై ఆగ్రహం
కొన్ని ప్రభుత్వ విభాగాల్లో ఉన్న అలసత్వం కారణంగానే విలువైన ప్రభుత్వ స్థలాలు ఆక్రమణల పాలవుతున్నాయని నిర్మలా సీతారామన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రస్తుతం నూతన భవనం నిర్మించిన 1.13 లక్షల చదరపు అడుగుల స్థలం 1973 నుంచే ఐటీ శాఖ ఆధీనంలో ఉన్నప్పటికీ.. ఏళ్ల తరబడి పర్యవేక్షణ లేకపోవడంతో ఆక్రమణలకు గురైందని తెలిపారు. మన ఆస్తులను మనమే కాపాడుకోలేకపోతే ఎలా అని ప్రశ్నించారు. అలసత్వాన్ని వీడి అధికారులంతా పారదర్శకతతో పనిచేయాలని సూచించారు.
సొంత ఆస్తులు పెంచుకుందాం.. అద్దెల భారం తగ్గిద్దాం!
వేగంగా విస్తరిస్తున్న ముంబై లాంటి ప్రధాన నగరాల్లో ఐటీ అధికారుల నివాస గృహాల కొరత తీర్చేందుకు చర్యలు తీసుకుంటానని మంత్రి హామీ ఇచ్చారు. భారీగా అద్దెలు చెల్లించే బదులు బిఎస్ఎన్ఎల్ (BSNL) వంటి ఇతర ప్రభుత్వ సంస్థల ఆధీనంలో ఉన్న ఖాళీ స్థలాలను ఐటీ శాఖ అవసరాలకు కేటాయించేలా సంబంధిత మంత్రులతో మాట్లాడతానని తెలిపారు. సీపీడబ్ల్యూడీతో సమన్వయం చేసుకుంటూ పనులు వేగవంతం చేసి, సొంత భవనాలను నిర్మించుకోవాలని అధికారులను ఆదేశించారు.
నాణేనికి ఒకటే వైపు.. నీతి నిజాయితీ మాత్రమే ప్రమాణం!
ఆదాయపు పన్ను వ్యవస్థ నిర్వహణలో అత్యున్నత నైతిక విలువలను పాటించాలని అధికారులకు నిర్మలా సీతారామన్ పిలుపునిచ్చారు. తాను ప్రతి ఒక్క అధికారి నుంచి కోరుకునేది ఒక్కటేనని.. అది "నిజాయితీ, నిబద్ధత" మాత్రమేనని స్పష్టం చేశారు. పన్నుల వసూలులో పారదర్శకతను పెంచుతూ పౌరుల విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలని ఆమె సూచించారు.












Click it and Unblock the Notifications