LPG కావాల్సినంత ఉంది. మీ ఇంటికి గ్యాస్ గ్యారెంటీ!
పశ్చిమాసియాలో ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధం కేవలం అక్కడ బాంబుల మోతకే పరిమితం కాలేదు.. అది నేరుగా మన వంటింట్లోని గ్యాస్ స్టవ్ వరకు చేరుకుంది. గత కొద్దిరోజులుగా హైదరాబాద్, బెంగళూరు, ముంబై వంటి నగరాల్లో "గ్యాస్ సిలిండర్ల కొరత" అనే వార్త సామాన్యుడిని కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ముఖ్యంగా వాణిజ్య సిలిండర్లు దొరక్క ముంబైలో 20 శాతం హోటళ్లు మూతపడటం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. అయితే, ఈ ఆందోళనల మధ్య కేంద్ర ప్రభుత్వం గృహిణులకు, హోటల్ యజమానులకు ఒక ఊరటనిచ్చే తీపి కబురు అందించింది.
గ్యాస్ కొరత అనేది కేవలం తాత్కాలికమేనని, ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి. యుద్ధం కారణంగా దిగుమతులకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు భారత రిఫైనరీలు తమ ఎల్‌పీజీ (LPG) ఉత్పత్తిని ఏకంగా 10 శాతం పెంచేశాయి. గృహ వినియోగదారులకు ఒక్క సిలిండర్ కూడా తక్కువ కాకుండా చూడటమే తమ మొదటి ప్రాధాన్యత అని అధికారులు భరోసా ఇస్తున్నారు. ఒకవేళ ఎవరైనా కృత్రిమ కొరతను సృష్టించి, బ్లాక్ మార్కెట్‌లో సిలిండర్లను అమ్మాలని చూస్తే వారిపై నిత్యావసర సరకుల చట్టం కింద కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

హోటళ్ల కోసం రంగంలోకి 'బిగ్ త్రీ' కమిటీ
సిలిండర్ల కొరతతో హోటళ్లు మూతపడుతున్నాయన్న వార్తలపై కేంద్రం తక్షణమే స్పందించింది. ఐఓసీ (IOC), హెచ్‌పీసీఎల్ (HPCL), బీపీసీఎల్ (BPCL) సంస్థలకు చెందిన ముగ్గురు కీలక అధికారులతో ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ నేరుగా రెస్టారెంట్ అసోసియేషన్లతో మాట్లాడి, ఎక్కడెక్కడ గ్యాస్ అవసరముందో గుర్తించి యుద్ధ ప్రాతిపదికన సరఫరా చేయనుంది. అంతేకాకుండా, బ్లాక్ మార్కెటింగ్‌కు చెక్ పెట్టేందుకు సిలిండర్ బుకింగ్ గడువును 21 రోజుల నుండి 25 రోజులకు పెంచడం వంటి కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

హర్మూజ్ జలసంధి కాకపోతే.. అమెరికా నుంచైనా తెస్తాం!
భారత్ తన చమురు దిగుమతుల కోసం గతంలో లాగా కేవలం ఒకే మార్గంపై ఆధారపడటం లేదు. మన ముడిచమురులో 70 శాతం ఇప్పుడు యుద్ధం ప్రభావితం లేని సురక్షిత మార్గాల ద్వారానే వస్తోంది. ఒకవేళ అరబ్ దేశాల నుంచి ఇబ్బంది ఎదురైనా.. నార్వే, అమెరికా వంటి దేశాల నుండి గ్యాస్ (LNG) తెప్పించుకునేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఆ దేశాల నుంచి సరుకు రావడానికి రెండు నెలల సమయం పట్టినప్పటికీ, అప్పటివరకు సరిపడా నిల్వలు మన వద్ద ఉన్నాయని, సరఫరా గొలుసులో ఎక్కడా బ్రేక్ పడదని ప్రభుత్వం ధీమా వ్యక్తం చేస్తోంది.












Click it and Unblock the Notifications