మోడీని ఢీకొనే సత్తా ఎవరికీ లేదు, భరించలేక వచ్చేశా: సీఎం నితీష్
బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత తొలిసారి బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తాజా పరిణామాలపై స్పందించారు.
న్యూఢిల్లీ: బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత తొలిసారి బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తాజా పరిణామాలపై స్పందించారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీపై ప్రశంసలు కురిపించడం గమనార్హం. మోడీ పెద్ద నాయకుడని, ఆయనను ఓడించే వారు ఇప్పట్లో ఎవరూ లేరని స్పష్టం చేశారు. 2019లోనూ మోడీనే ప్రధాని అవుతారని పరోక్షంగా తేల్చి చెప్పారు.
ఇక ఓపిక పట్టలేని పరిస్థితి ఏర్పడటం వల్లే తాను ఆర్జేడీతో దూరంగా జరగాల్సి వచ్చిందని నితీష్ తెలిపారు. అప్పటి వరకు చాలా విషయాలను భరించానని, అలాంటి పరిస్థితి ఇక ఏ మాత్రం కొనసాగించడం వీలుకాకపోవడం వల్లే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

అసెంబ్లీ ఎన్నికల్లో విజయం తర్వాత ఆర్జేడీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నితీష్.. తమ బంధానికి గుడ్ బై చెబుతూ బీజేపీతో తాజాగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో ఇతర పార్టీల నుంచే గాక సొంత పార్టీ నేతలు నుంచి కూడా విమర్శలు రావడంతో నితీష్ సోమవారం స్పందించారు.
మహాగటబంధన్‌తో సహా తాను ప్రతి ఒక్కటీ సహనంతో భరిస్తూ వచ్చానని, కానీ, చివరకు విడిపోవడం తప్ప వేరే మార్గం కనిపించలేదని నితీస్ స్పష్టం చేశారు. తాను ఎవరినీ రాజీనామా చేయాలని అడగలేదని చెప్పిన నితీష్.. డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్‌పై వచ్చిన అవినీతి ఆరోపణల విషయంలో ప్రజలకు స్పష్టతనివ్వాలని మాత్రం లాలూ ప్రసాద్ యాదవ్ ను కోరినట్లు చెప్పారు.
కానీ, ఈ విషయంలో వారు సంసిద్ధతను వ్యక్తం చేయలేదని నితీష్ కుమార్ తెలిపారు. ఇప్పటి వరకు ఏ మాత్రం అవినీతిని భరించలేని తాను.. తేజస్వీ విషయంలో తన నిబంధనలతో ఎలా రాజీపడాలని తనను తాను ప్రశ్నించుకున్నట్లు తెలిపారు. ఓపిక నశించడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నానని నితీష్ వెల్లడించారు.












Click it and Unblock the Notifications