పట్టాలు తప్పిన ఉజ్జయినీ ఎక్స్ ప్రెస్
మొన్న రాజధాని ఎక్స్ ప్రెస్ లో మంటలు అంటుకున్నాయి. నిన్న పాట్నా ఫాస్ట్ పాసింజర్ లో అగ్నిప్రమాదం సంభవించింది. తాజాగా ఉజ్జయినీ ఎక్స్ ప్రెస్ పట్టాలు తప్పింది. మూడు రోజుల వ్యవధిలో మూడు రైలు ప్రమాదాలు సంభవించడం అసాధారణమే. ఈ ప్రమాదాల్లో ఎవరూ ప్రాణాలను కోల్పోకపోవడం ఊపిరి పీల్చుకునే విషయమే అయినప్పటికీ వరుస ఘటనలు రైల్వే నిర్లక్ష్యాన్ని ఎత్తి చూపుతున్నట్టయింది.
సోమవారం రాత్రి ఉత్తరాఖండ్ లో ఉజ్జయిని ఎక్స్ ప్రెస్ ప్రమాదానికి గురైంది. రిషికేష్ యోగనగరి రైల్వే స్టేషన్లో షంటింగ్ జరుగుతున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో మూడు బోగీలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఆ సమయంలో లోపల ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది.

ఉజ్జయిని ఎక్స్‌ప్రెస్ సాయంత్రం 6 గంటల ప్రాంతంలో యోగనగరి స్టేషన్‌కు చేరుకుంది. ఈ తెల్లవారు జామున 6:15 గంటలకు ఉజ్జయిని వెళ్లవలసి ఉంది. రైలును రాత్రి 9:30 గంటల ప్రాంతంలో ప్లాట్‌ఫారమ్ నుండి ఖండ్గావ్ షంటింగ్ లైన్‌కు తరలిస్తుండగా, ఇంజిన్ షంటింగ్ లైన్ చివరిలోని బఫర్‌ను ఢీకొట్టిందని ఆర్పిఎఫ్ ఇన్స్పెక్టర్ సరోజ్ కుమార్ తెలిపారు.
బఫర్‌ను ఢీకొట్టడంతో రైలు ఒక్కసారిగా పెద్ద కుదుపుతో ఆగిపోయింది. దీనివల్ల మధ్యలోని ఒక బోగీపై విపరీతమైన ఒత్తిడి ఏర్పడి, అది పూర్తిగా వంగిపోయి పట్టాలు తప్పింది. ఈ ప్రమాదానికి లోకో పైలట్ నిర్లక్ష్యమే కారణమై ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. దీనిపై రైల్వే అధికారులు ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.
సమాచారం అందిన వెంటనే రైల్వే, ఆర్పీఎఫ్, జీఆర్పీ, పోలీసులు సహా పలు విభాగాల అధికారులు, సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనతో రైల్వే స్టేషన్ లో ఒక లైన్ ను పూర్తిగా మూసివేశారు. ఫలితంగా ఇతర రైళ్ల రాకపోకల్లో జాప్యం నెలకొంది.












Click it and Unblock the Notifications