ఆసక్తికరం: సుష్మకు ప్రతిపక్షాల పొగడ్త, చేతులెత్తి థ్యాంక్స్
న్యూఢిల్లీ: కేంద్రమంత్రి సుష్మా స్వరాజ్ పైన ఆమ్ ఆద్మీ పార్టీ సభ్యులు పొగడ్తలలో ముంచెత్తారు. దానికి సుష్మా ధన్యవాదాలు తెలిపారు. కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వం మధ్య నిత్యం ఘర్షణాత్మక వాతావరణం నెలకొంటున్న విషయం తెలిసిందే. కానీ తాజాగా సుష్మను ఏఏపీ నేతలు పొగడటం గమనార్హం. ఇతర విపక్ష సభ్యులు కూడా ఆమెను ప్రశంసించారు.
మన దేశ ప్రజలు విదేశాల్లో ఇబ్బందులు పడుతున్న సమయంలో సుష్మా స్వరాజ్ చూపిన చొరవ అభినందనీయమని, అందుకామెకు కృతజ్ఞతలు చెబుతున్నానని ఎంపీ భగవంత్ మాన్‌లోక్ లోకసభలో వ్యాఖ్యానించారు.
తన నియోజకవర్గానికి చెందిన 13మంది సౌదీ అరేబియాలో బానిసలుగా బతుకుతూ ఇబ్బందులు పడుతున్న సమయంలో... సమస్యను సుష్మా దృష్టికి తీసుకు వెళ్లానని, ఆమె స్పందిన తీరు అద్భుతమన్నారు. మరో ఏఏపీ ఎంపీ ధరమ్ వీర్ గాంధీ సైతం ఆమె చర్యలను కొనియాడారు.

నేను మిమ్మల్ని ఏ ప్రశ్నా అడగబోనని, అవసరం వచ్చినప్పుడు ఆమె తీసుకుంటున్న చర్యలకు కృతజ్ఞతలు చెప్పేందుకే లేచానని, పంజాబ్ ప్రజలకు ఆమె ఎంతో చేస్తున్నారని చెప్పారు. ఓ మంత్రిగా సుష్మా స్వరాజ్ స్పందించే తీరు అత్యద్భుతమని బిజూ జనతాదళ్ నేత బైజయంత్ పాండా వ్యాఖ్యానించారు.
ఆర్జేడీ సభ్యుడు రాజేష్ రంజన్ మాట్లాడుతూ... ప్రశ్నలు ఇంగ్లీష్‌లో వేసినా, ఆమె హిందీలో సమాధానం చెప్పడం ముదావహమన్నారు. స్పీకర్ సుమిత్రా మహాజన్ స్పందిస్తూ... కృతజ్ఞతలు తప్ప ప్రశ్నలే లేవా? అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మరోవైపు, ప్రతిపక్ష ఎంపీల పొగడ్తలకు సుష్మా.. చేతులెత్తి నమస్కరించి కృతజ్ఞతలు తెలిపారు.












Click it and Unblock the Notifications