నేషనల్ పార్క్‌లో మరణ మృదంగం: మరో చిరుత మృతి
భోపాల్: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న చిరుతల ట్రాన్స్‌లొకేషన్ ప్రాజెక్ట్ బెడిసికొడుతోంది. ఆశించిన స్థాయిలో సత్ఫలితాలను ఇవ్వట్లేదు. ఎక్కడో నమీబియా, దక్షిణాఫ్రికా అడవుల నుంచి భారత్‌కు తీసుకొచ్చిన చిరుతలు.. ఇక్కడి వాతావరణం, భౌగోళిక పరిస్థితులకు ఇమడలేకపోతున్నాయి. ఒకదాని వెంట ఒకటిగా మృత్యువాత పడుతున్నాయి.
ట్రాన్స్‌లొకేషన్ ప్రాజెక్ట్ కింద నమీబియా, దక్షిణాఫ్రికాల నుంచి చిరుతలను కేంద్ర ప్రభుత్వం భారత్‌కు తీసుకొచ్చింది. వాటిని మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్‌లో విడిచిపెట్టింది. గత ఏడాది సెప్టెంబర్‌లో తన పుట్టినరోజు సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వహస్తాలతో నమీబియా నుంచి తీసుకొచ్చిన ఎనిమిది చిరుతలను కునో నేషనల్ పార్క్‌లో విడిచిపెట్టారు.

ఆ తరువాత దక్షిణాఫ్రికా నుంచి తీసుకొచ్చిన మరో 12 చిరుతలను మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్.. ఇదే పార్క్‌లో వదిలారు. అప్పటి నుంచీ చిరుతలు మరణిస్తూనే వస్తోన్నాయి. ఇప్పటికే ఎనిమిది చిరుతలు మృతి చెందాయి. ఇది- ఇక్కడితో ఆగడం అసంభవం అనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి.
ట్రాన్స్‌లొకేషన్ ప్రాజెక్ట్ కింద భారత్‌కు తరలించిన చిరుతలు ఎక్కువ కాలం జీవించలేవంటూ ఇదివరకే దక్షిణాఫ్రికా స్పష్టం చేసింది కూడా. అప్పట్లో కేంద్ర ప్రభుత్వం దీన్ని తప్పుపట్టింది. వాటిని సంరక్షించడానికి అన్ని చర్యలను తీసుకున్నామంటూ ప్రకటించింది. వాటి ఆరోగ్య పరిస్థితులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తోన్నామంటూ పేర్కొంది.
ఈ పరిణామాల మధ్య తాజాగా- కునో నేషనల్ పార్క్‌లో మరో చిరుత మరణించింది. ఈ చిరుత పేరు- ధాత్రి. ఆడ చిరుత. అనారోగ్య కారణాలతో ఈ ఉదయం మరణించింది. పోస్ట్ మార్టమ్ నిర్వహించినట్లు మధ్యప్రదేశ్ అటవీ మంత్రిత్వ శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ (వైల్డ్ లైఫ్) అసీమ్ శ్రీవాస్తవ తెలిపారు. దీనితో ఇప్పటివరకు కన్నుమూసిన చిరుతల సంఖ్య తొమ్మిదికి చేరింది. నమీబియా, దక్షిణాఫ్రికాల నుంచి తీసుకొచ్చిన 20 చిరుతల్లో తొమ్మిది తుదిశ్వాస విడిచాయి.












Click it and Unblock the Notifications