పాక్ నిర్ణయంతో భారత ప్రయాణికులపై అదనపు భారం!
Pahalgam Terror Attack: పహల్గామ్ ఉగ్రదాడి ఘటన అనంతరం భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు తారస్థాయికి చేరాయి. పహల్గాం ఉగ్రదాడి పాకిస్థాన్ ప్రేరేపితమని తేలడంతో ఆ దేశంపై కఠిన చర్యలు తీసుకుంటోంది భారత్. ఇప్పటికే సింధూ జలాల ఒప్పందం నిలిపివేత, పాకిస్థానీలకు వీసాల రద్దు, సరిహద్దు మూసివేత వంటి నిర్ణయాలను కేంద్ర ప్రభుత్వం తీసుకుంది.
దేశంలోని పాక్ పౌరులను 48 గంటల్లోకా దేశం విడిచి వెళ్లాలని ఆదేశించింది. పాక్ హైకమిషన్‌ను కూడా ఖాళీ చేయాలని స్పష్టం చేసింది. ఈ క్రమంలో పాకిస్థాన్ కూడా భారత్‌పై ఇలాంటి చర్యలే చేపట్టింది. భారత్ తో వాణిజ్యం రద్దు చేయడంతోపాటు అన్ని ద్వైపాక్షిక ఒప్పందాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. అంతేగాక, పాకిస్థాన్ గగనతలాన్ని భారతీయ విమానయాన సంస్థలకు మూసివేస్తున్నట్లు తేల్చి చెప్పింది.

పాక్ గగనతలం మూసివేత ఫలితంగా భారతీయ విమానయాన సంస్థలపై అధిక భారం పడనుంది. మిడిల్ ఈస్ట్, యూరప్, కెనడా, అమెరికా వంటి దేశాలకు వెళ్లాలంటే ఎక్కువ సమయంతోపాటు ఎక్కువ ఇంధనాన్ని కూడా వినియోగించాల్సి ఉంటుంది. గతంలో 2019లో బాలకోట్ వైమానిక దాడుల సమయంలో కూడా పాకిస్థాన్ భారత విమానాలకు తన గగన తలాన్ని నిరాకరించింది. ఆ సమయంలో భారత విమానయాన సంస్థలు దాదాపు 700 కోట్ల వరకు నష్టపోయాయి.
ఇతర దేశాలకు సంబంధించిన విమానయాన సంస్థలు పాక్ గగనతలాన్ని ఉపయోగించుకుని భారత్ వచ్చే అవకాశం ఉంది. దీంతో భారతీయులు కూడా విదేశీ విమానయాన సంస్థలను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. లేదంటే మనదేశ విమానయాన సంస్థలకు చెందిన విమానాల్లో ప్రయాణించాలంటే ఎక్కువ సమయంతోపాటు టికెట్ల కోసం ఎక్కువ ధరను కూడా చెల్లించాల్సి ఉంటుంది.
ప్రస్తుతం ఉత్తర భారతదేశ నగరాల నుంచి వెళ్లే విమానాలను గుజరాత్, మహారాష్ట్ర మీదుగా దారి మళ్లించి.. యూరప్, అమెరికా, పశ్చిమాసియా దేశాలకు నడుపుతున్నారు. కాగా, టాటా గ్రూపునకు చెందిన విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా (Air India) పాక్ గగనతల ప్రయాణం నిషేధం వేళ కీలక ప్రకటన చేసింది. ఇకపై ప్రత్యామ్నాయ మార్గంలో విమానాలు నడపనున్నట్లు తెలిపింది. దీంతో ఆ మేర ప్రయాణ సమయంతోపాటు టికెట్ ధర కూడా పెరిగే అవకాశం ఉందని విమానయాన వర్గాలు పేర్కొన్నాయి.
పాక్ ఎయిర్ స్పేస్ మూసివేతతో తాము నడిపే కొన్ని అంతర్జాతీయ విమానాలపై ప్రభావం పడుతోందని ఇండిగో సంస్థ పేర్కొంది. వీలైనంత త్వరగా గమ్యస్థానాలకు చేర్చడంలో తమ సిబ్బంది ప్రయత్నిస్తారని తెలిపింది. ఒక వేళ మీరు ప్రయాణించబోయే విమానంపైనా దీని ప్రభావం ఉంటే స్టేటస్ చెక్ చేసి తమ వెబ్ సైట్ ద్వారా రీ బుకింగ్ లేదా రిఫండ్ పొందవచ్చని ప్రయాణికులకు పేర్కొంది. అంతర్జాతీయ సర్వీసులను ఎక్కువగా ఎయిరిండియానే నడుపుతోంది. ఎయిరిండియాతోపాటు ఇండిగో, స్పైస్ జెట్, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ కూడా అంతర్జాతీయ సర్వీసులను నడుపుతున్నాయి. తాజా పరిణామాల నేపథ్యంలో ప్రయాణికులు గమస్థానాలు చేరుకునేందుకు అదనపు సమయంతోపాటు డబ్బును కూడా చెల్లించాల్సిన పరిస్థితులు నెలకున్నాయి.












Click it and Unblock the Notifications