'నాన్నే అమ్మను తగలబెట్టారు'
గ్రేటర్ నోయిడాలోని సిర్సా గ్రామంలో జరిగిన ఒక దారుణ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కట్నం కోసం వేధించి నిక్కి అనే మహిళను ఆమె అత్తింటివారు తీవ్రంగా కొట్టి, ఆ తర్వాత సజీవదహనం చేసినట్లు ఆరోపణలు వెలువడ్డాయి. ఈ అమానుష చర్యలో ఆమె భర్త విపిన్, అతని కుటుంబ సభ్యులు ఉన్నారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన ఒక వీడియోలో నిక్కి కొడుకు "నాన్న నా అమ్మని తగలబెట్టారు" అని చెప్పడం ఈ కేసులో ఒక కీలక మలుపుగా మారింది.
అసలేం జరిగిందంటే?
నిక్కికి 2016 డిసెంబర్‌లో సిర్సా గ్రామానికి చెందిన విపిన్‌తో వివాహం జరిగింది. పెళ్లి సమయంలో నిక్కి కుటుంబం వారికి స్కార్పియో కారుతో పాటు భారీగా కట్నం ఇచ్చింది. అయితే, పెళ్లయిన తర్వాత కూడా అత్తింటివారు రూ. 35 లక్షలు అదనంగా తీసుకురావాలని వేధించడం మొదలుపెట్టారు. నిక్కి తల్లిదండ్రులు వారి డిమాండ్ మేరకు మరో కారును కూడా ఇచ్చినా, వేధింపులు మాత్రం ఆగలేదు.

నిక్కి అక్క కంచన్‌కు కూడా అదే కుటుంబంలో వివాహం జరిగింది. కంచన్ చెప్పిన దాని ప్రకారం.. నిందితులు నిక్కిని దారుణంగా కొట్టారు, గొంతుపై దాడి చేశారు. ఆమె స్పృహ కోల్పోగానే, ఆమెపై మండే పదార్థం పోసి నిప్పంటించారు. తీవ్రంగా గాయపడిన నిక్కిని పొరుగువారి సహాయంతో మొదట స్థానిక ఆసుపత్రికి తరలించారు, ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆసుపత్రికి తరలించే మార్గంలో ఆమె మరణించింది.
దర్యాప్తు వివరాలు ఇలా..
నిక్కి సోదరి కంచన్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా.. పోలీసులు భర్త విపిన్, అతని సోదరుడు రోహిత్, అత్తగారు దయ, మామ సత్‌వీర్లపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో పోలీసులు విపిన్‌ను వెంటనే అరెస్టు చేశారు. మిగిలిన ముగ్గురు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు, త్వరలోనే వారిని పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. నిక్కి మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించిన తర్వాత ఆమె కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ కేసు దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications