షరీఫ్ లేఖకు మోడీ సమాధానం: ఎదురుచూస్తున్నామని
న్యూఢిల్లీ: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ రాసిన లేఖకు మరో లేఖ ద్వారా సమాధానమిచ్చారు. ఘర్షణ, హింసకు తావులేని సానుకూల వాతావరణంలో షరీఫ్, ఆయన ప్రభుత్వంతో కలిసి పని చేయడానికి తాము ఎదురుచూస్తున్నామని మోడీ ఆ లేఖలో తెలిపారు. మే 26న తన ప్రమాణ స్వీకారోత్సవానికి విచ్చేసినందుకు మోడీ ఆయనకు ధన్యవాదాలు తెలిపారు.
ఆ కార్యక్రమానికి నవాజ్ షరీఫ్ విచ్చేయడం రెండు దేశాల సంయుక్త ఆశయాలకు, కలిసి పని చేయడానికి, ప్రజాస్వామ్య విధానాలకు బలాన్నించిందని పేర్కొన్నారు. రెండు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపడాలని, ఇరుదేశాల మధ్య శాంతియుత, స్నేహపూర్వక వాతావరణం నెలకొల్పడానికి కృషి చేయాలని, యువతకు ఉపాధి కల్పించే దిశగా అడుగువేయాలని అన్నారు.

రెండు ప్రాంతాల ప్రజలకు మెరుగైన, భద్రతతో కూడిన భవిష్యత్తును అందిద్దామమని లేఖలో స్పష్టం చేశారు. ఇటీవల కరాచీ విమానాశ్రయంలో జరిగిన దాడుల్లో మృతి చెందినవారి కుటుంబాలకు మోడీ సంతాపం తెలిపారు. తన తల్లికి చీరను కానుకగా పంపడం పట్ల షరీఫ్‌కు నరేంద్ర మోడీ ధన్యవాదాలు తెలిపారు.
ఇది ఇలా ఉండగా శనివారం దేశంలో అత్యంత పెద్దదైన యుద్ధనౌక ఐఎన్ఎస్ విక్రమాదిత్యను ప్రధాని నరేంద్ర మోడీ సందర్శించనున్నారు. ప్రధానిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత మోడీ మొదటిసారిగా ఈ పర్యటనకు రానున్నారు. ఎయిర్ క్రాఫ్ట్‌లను మోసుకెళ్లగలిగే సామర్థ్యం ఉన్న అతిపెద్ధ యుద్ధనౌక ఐఎన్ఎస్ విక్రమాదిత్య ప్రస్తుతం గోవా తీరంలో ఉంది. దీనిపైకి మోడీ హెలికాప్టర్ ద్వారా చేరుకుంటారు. యుద్దనౌకపై నేవీ కార్యకలాపాలను ఆయన పర్యవేక్షిస్తారని రక్షణశాఖ అధికార ప్రతినిధి ఈ మేరకు వివరాలను వెల్లడించారు.












Click it and Unblock the Notifications